
విద్యా సంస్థల నుంచి పేటెంట్ దరఖాస్తులు
మొత్తం అప్లికేషన్లలో వీటిదే అగ్రస్థానం
2009తో పోలిస్తే మూడురెట్లు పెరుగుదల
భారత్‌లో ఆవిష్కరణల వేగం పుంజుకొంది. దానికి తగ్గట్టుగా మేధో సంపత్తి హక్కుల (ఐపీ) కోసం దరఖాస్తులూ వెల్లువెత్తుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం దేశంలో దాఖలైన పేటెంట్లలో భారతీయ సంస్థల వాటా 20% కంటే తక్కువ. 2023కి వచ్చేసరికి ముఖచిత్రం మారిపోయింది. మొత్తం పేటెంట్ ఫైలింగ్స్‌లో ఏకంగా 57 శాతం వాటాతో మన సంస్థలు సత్తా చాటాయి. దరఖాస్తుల్లో దేశీయ యూనివర్సిటీలు ముందంజలో ఉండడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుండి సృష్టికర్తగా మారడానికి మనదేశం క్రమంగా అడుగులేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–15లో భారతీయుల నుంచి వచ్చిన పేటెంట్ దరఖాస్తులు 12,071 కాగా, 2023–24 నాటికి ఇది 51,574కు పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అలాగే, అప్పట్లో పేటెంట్ల మంజూరు కేవలం 684 కాగా, పదేళ్లలో 25,082కు పెరిగింది. పేటెంట్ నియమాలకు సవరణలతో నిర్దిష్ట గ్రూప్స్‌నకు వేగంగా పరీక్షలు, గడువు కాలాన్ని సరళీకృతం చేయడం.. విద్యా సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు దరఖాస్తు రుసుములను 80% తగ్గించడం.. ఫైలింగ్, సమాచారం పూర్తిగా డిజిటలైజేషన్ వంటి సంస్కరణలకు దారితీశాయి.
యూనివర్సిటీల సత్తా
పేటెంట్ దాఖలు, టెక్నాలజీ బదిలీ, మేధోసంపత్తి హక్కు ల (ఐపీ) ద్వారా ఆదాయ సముపార్జన వంటి అంశాల్లో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రత్యేక ఐపీ సెల్స్‌ను, చట్టపరమైన సహాయ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా విశ్వవిద్యాల యాలు కూడా ముందంజలో ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థలలో మేధోసంపత్తి హక్కులపై అవగాహన కోసం ప్రభుత్వం 2020లో ‘కపిల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అలాగే 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. 2021 సెప్టెంబరు నుంచి పేటెంట్ దరఖాస్తు రుసుము గణనీయంగా తగ్గడం యూనివర్సిటీల్లో జోష్ నింపింది. ఐఐటీ మద్రాస్ 2022లో 156 పేటెంట్లను అందుకోగా.. ఏడాదిలో ఈ సంఖ్య 300కి చేరింది. ఐఐటీ బాంబే 2023–24లో 421 పేటెంట్లతో దేశంలో అగ్రస్థానంలో ఉంది.
⇒ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ 2020లో 48వ స్థానం నుంచి 2024లో 39వ స్థానానికి ఎగబాకింది.
⇒ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి చేస్తున్న వ్యయం ప్రస్తుతం జీడీపీలో 0.67% మాత్రమే. ఇది యూఎస్‌లో 3.5%, చైనాలో 2.5%.
⇒ విద్యా సంస్థల పేటెంట్ అప్లికేషన్స్
సంవత్సరం భారత్ విదేశీ
2021–22 7,405 96
2022–23 19,155 275
2023–24 23,306 237
పెరిగిన వేగం
రెండేళ్లలో దాఖలైన దాదాపు 80% పేటెంట్లు ఇప్పటికీ నమోదు కోసం వేచి ఉన్నాయి. అయితే 2000ల ప్రారంభంలో ఒక్కో పేటెంట్ మంజూరుకు 8–10 సంవత్సరాలు పట్టింది. 2020లో చాలావరకు 2–3 ఏళ్లలోపే అయిపోయాయి. కొన్ని దరఖాస్తు చేసిన ఏడాదిలోనే మంజూరయ్యాయి.

వ్యక్తులూ.. విద్యాసంస్థలూ..
2000లో వచ్చిన మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో కంపెనీలవి 43 శాతం కాగా, 2023 నాటికి ఇది 17 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో వ్యక్తుల దరఖాస్తులు 10 నుంచి 32 శాతానికి పెరిగాయి. 2010లో 20 శాతంలోపే ఉన్న విద్యాసంస్థల వాటా.. ఇప్పుడు ఏకంగా 43 శాతానికి ఎగబాకింది. 2023–24లో దేశీయ సంస్థలు, వ్యక్తుల వంటి వారు పెట్టుకున్న మొత్తం పేటెంట్ దరఖాస్తులు 51,574 కాగా మంజూరైనవి 25,079. ఇందులో..

⇒ 2010 నుంచి 2025 సెప్టెంబరు 11 వరకు ఫైల్‌చేసిన పేటెంట్లు 9,32,693
⇒ వీటిలో భారతీయులు దరఖాస్తు చేసినవి 3,83,073
⇒ మొత్తం దరఖాస్తుల్లో మంజూరైనవి 3,20,807
⇒ వీటిలో భారతీయులవి 70,088
