
యుద్ధ రీతిని సమూలంగా మార్చిన డ్రోన్లు
సైనిక సంపదలో కీలకంగా ఈ ఆధునిక వ్యవస్థ
ఆపరేషన్ సిందూర్ తోసత్తా చాటిన భారత్
డ్రోన్స్ తయారీలోదిగ్గజ కంపెనీలు నిమగ్నం
మేము సైతం అంటున్న హైదరాబాద్ సంస్థలు
సాక్షి స్పెషల్ డెస్క్,సాక్షి, హైదరాబాద్:రాజుల కాలంలో కత్తులు, బల్లేలతో సైనికులు రణక్షేత్రంలో పోరాడారు. తరవాత.. యుద్ధ భూమిలో తుపాకులు, బాంబుల మోత మోగింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మానవ రహిత విమానాలు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు.. ఏకంగా వేల మైళ్ల దూరం నుంచే శత్రుదేశంపై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్.. తాజాగా భారత్–పాక్... యుద్ధం ఏదైనా.. డ్రోన్స్ (మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ)) ఇప్పుడు సైనిక సంపదలో అత్యంత కీలకంగా మారాయి.
పెళ్లిళ్ల వంటి వేడుకల్లో ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్స్ మాత్రమే చాలా మందికి సుపరిచితం. కానీ, డ్రోన్స్ అంటే అంతకుమించి. డ్రోన్లు అధునాతన ఆయుధాలు. ఎవ్వరూ ప్రాణాలను పణంగా పెట్టకుండానే కచి్చతమైన దాడులు చేయడం, వేగంగా మోహరించే సామర్థ్యం వీటి సొంతం. క్షిపణులతో పోలిస్తే వీటి అభివృద్ధికి అయ్యే వ్యయమూ తక్కువే.
మన దేశంలో డ్రోన్ల వాడకం..
1999లో కార్గిల్ యుద్ధంలో మన సైన్యం తొలిసారి యూఏవీలను వినియోగించింది. ఆ తర్వాత ఇండియా అధికారికంగా వీటి కొనుగోలు మొదలు పెట్టింది. ప్రస్తుతం మన సైన్యం వద్ద ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న సెర్చర్ ఎంకే–2 టాక్టికల్ డ్రోన్స్, హెరాన్‌మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (ఎంఏఎల్‌ఈ), హార్పీ యాంటీ రాడార్ డ్రోన్లు ఉన్నాయి.
హార్పీ అనేది ఆత్మాహుతి డ్రోన్(లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థను కూల్చివేసే క్రమంలో దీన్ని వినియోగించారు). వీటితో పాటు హరోప్ లాయిటరింగ్ అటాక్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. రాడార్ సైట్లు, వాహనాలే లక్ష్యంగా మందుగుండుతో ఢీకొట్టి సర్వనాశనం చేయడం దీని స్పెషాలిటీ. దీంతో పాటు అధిక మన్నిక, పేలోడ్ సామర్థ్యం కలిగిన ఇజ్రాయిల్ ఎంఏఎల్‌ఈ డ్రోన్’హెరాన్‌టీపీ/మార్క్ 2’కూడా మన దగ్గర ఉంది.
మొదటి ప్రపంచ యుద్ధంలో..
మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా రెండూ తొలిసారిగా యూఏవీతో ప్రయోగాలు చేశాయి. 1950–60లలో శత్రు భూభాగంపై గూఢచర్యం చేయడానికి యూఎస్ చిన్న రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు ఉపయోగించింది. వియత్నాం యుద్ధంలో నిఘా యూఏవీలు తొలిసారిగా మోహరించారు. 2000వ సంవత్సరంలో అమెరికా హెల్‌ఫైర్ క్షిపణులతో కూడిన ప్రిడేటర్ డ్రోన్‌ను రూపొందించింది. ఇక్కడి నుంచే సైనిక ఆయుధ భాండాగారంలోపెనుమార్పులు వచ్చాయి.
మగ తేనెటీగను ఇంగ్లీషులో డ్రోన్ అంటారు. శ్రామిక తేనెటీగలకన్నాఇవి పెద్దగానే ఉంటాయి. కానీ తేనెనూ సంపాదించలేవు. తమను తామూపోషించుకోలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇవి చేసే పని ఏమీ ఉండదు. కానీ, ఆడ తేనెటీగ కోసం వెతుకుతూ ఎగిరి, దాన్ని కలిశాక పడిపోతుంది. డ్రోన్ మాత్రం అలాకాదు.. చూసి రమ్మంటే కాల్చి వస్తుంది.
హైదరాబాద్ నుంచి..
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇప్పటికే నిలిచింది. డిఫెన్స్ డ్రోన్‌విభాగంలోనూ ఇదే బాటలో పయనిస్తోంది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్.. భారత రక్షణ శాఖ కోసం ఏఎల్‌ఎస్–250 యూఏవీలను ఉత్పత్తి చేస్తోంది. అదానీ–ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఇండియా.. హెర్మీస్ 900 యూఏవీలను తయారు చేస్తోంది. రక్షణ రంగానికి కావాల్సిన కీలక యంత్ర, పరికరాల తయారీలో ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ సంస్థ ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌కు చెందిన ట్రిన్నోవేట్ సినర్జీ టెక్నాలజీస్ చిన్న యూఏవీలు, హైబ్రిడ్ డ్రోన్స్ సరఫరా చేస్తోంది.
ఆయుధాలను మోసే యూఏవీలను ఇండియన్ ఆర్మీకి అందిస్తోంది. జెన్ టెక్నాలజీస్ చిన్న యూఏవీలను భారత రక్షణ విభాగాలకు సరఫరా చేస్తోంది. ఎస్‌ఈసీ డీఆర్‌వీఏఎన్‌ఇన్నోవెన్షన్స్.. మిలిటరీ టెస్టింగ్ కోసం టార్గెట్ డ్రోన్లను; శిక్షణ, మదింపు కోసం శత్రు డ్రోన్లను అనుకరించే యూఏవీలను ఆఫర్ చేస్తోంది. మారుత్ డ్రోన్స్ రక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది.
టీ–హబ్, టీ–వర్క్స్ కేంద్రంగా కొన్ని స్టార్టప్స్ ఈ సెగ్మెంట్లోకి రానున్నాయి. భారత్ ఎలక్ట్రికల్స్ – హిందూస్థాన్ ఏరోనాటిక్స్ తయారీ భాగస్వాములుగా డీఆర్‌డీఓ రుస్తోమ్ – 2 డ్రోన్స్ అభివృద్ధి చేసింది. దక్ష యూఏవీ, ఐడియా ఫోర్జ్ వంటివి కూడా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
2030 నాటికి రూ.34,860 కోట్లకు..
డ్రోన్స్, యూఏవీల తయారీలో 75% వరకు విడి భాగాలు దేశీయంగా ఉత్పత్తి అయినవే. కొన్ని నెలల్లో ఇది 100 శాతానికి చేరడం ఖాయమని పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. డిఫెన్స్ డ్రోన్‌కంపెనీలు పరిశోధన, అభివృద్ధి, తయారీకి ఇప్పటికే రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టాయి. పరిశ్రమకు రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. భారత సైనిక డ్రోన్ మార్కెట్ 2024లో రూ.13,040 కోట్లు. 2030 నాటికి ఇది రూ.34,860 కోట్లకు చేరుతుందని గ్రాండ్ వ్యూ రిసర్చ్ అంచనా.