
కశ్మీర్, పంజాబ్‌లోని తెలుగు విద్యార్థుల వెల్లడి
డ్రోన్లు, కాల్పులతో ఏం జరుగుతుందో తెలియక భయపడ్డాం
మా హాస్టల్ రూమ్‌ల పైనుంచి పాకిస్తాన్ డ్రోన్‌లు వెళ్లాయి
సురక్షితంగా ఢిల్లీ చేరుకున్న తెలంగాణ, ఏపీ విద్యార్థులు
తెలంగాణ, ఏపీ భవన్‌లలో భోజనం, బస కల్పించిన అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ/సంగారెడ్డి క్రైం: ‘భీకరమైన శబ్దాలు, మెరుపుల్లా డ్రోన్లు, ఆకాశం వైపు చూస్తే చాలు.. గుండె ఆగేంత భయం. భారత్–పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాము’అని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల నుంచి తాము సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 మంది, తెలంగాణకు చెందిన 17 మంది విద్యార్థులు సురక్షితంగా ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌కు చేరుకున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు వేర్వేరుగా బస, భోజన ఏర్పాట్లు చేశారు.
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా విద్యార్థులను విమానాలు, రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. వీరిలో కొందరు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు.
ఓ పక్క భయం..ఇంకో పక్క రైల్వే దోపిడీ
రెండు రాత్రులు డ్రోన్‌లు, కాల్పుల శబ్దాలతో గజగజలాడాము. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకోవడానికి పంజాబ్‌లోని పగ్వరా రైల్వే స్టేషన్‌కు వచ్చాం. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కాము. అయితే ఖాళీ లేకపోవడంతో వాష్‌రూమ్ బయట నిలబడ్డాం. టీసీ మమ్మల్ని తర్వాతి స్టేషన్ లుధియానాలో దించేశారు.
రిజర్వేషన్ ఉన్నా ఏసీ కోచ్‌లో ఉన్నాం అనే కారణంతో ఐదుగురు నుంచి టీసీ రూ.4,500 వసూలు చేశారు. తర్వాత వచ్చి న ఇంటర్ సిటీ ఎక్కితే దానిలో రిజర్వేషన్ లేదు.. అని వాళ్లు మరో రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. ఓ పక్క యుద్ధ ప్రాంతం నుంచి బయటపడ్డామనుకుంటే, ఇంకో పక్క రైల్వే దోపిడీతో మోసపోయాం. –ఎస్.మధువర్షిత, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్
హాస్టల్ చుట్టూ.. డ్రోన్లు
పదుల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లు మా యూనివర్సిటీలోని హాస్టల్ చుట్టూ తిరిగాయి. ఆ శబ్దాలకు చెవులు గింగురుమనడమే కాదు, ఏం జరుగుతుందోనని భయపడిపోయా. ఉదయం రైల్వేస్టేషన్‌కు వచ్చేందుకు బస్సు దగ్గరకు వెళుతుండగా అప్పుడు కూడా మాపై నుంచి డ్రోన్లు వెళ్లాయి. –సీహెచ్ భానుకిరణ్, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్
డ్రోన్ల శబ్దాలకు భయం వేసింది
8వ తేదీ రాత్రి చదువుకుంటున్నాం. ఒక్కసారిగా పైనుంచి భారీ శబ్దాలు.. అవి ఏమిటో మొదట మాకు అర్థం కాలేదు. హాస్టల్ యాజమాన్యం మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఓ రూమ్‌లో కూర్చోబెట్టింది. అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ డ్రోన్ల శబ్దాలు ఆగిపోవడంతో పడుకోవడానికి రూమ్‌లలోకి వెళ్లాము. పడుకున్న రెండు గంటల్లోనే మళ్లీ భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా హాస్టల్ రూమ్‌లలో గడిపాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. –ఎస్.జీవన జ్యోతి, ఐఐటీ జగతి (జమ్మూ)
ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి
మేము చదువుకునే యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం రాత్రంతా బాంబుల శబ్దం రావడంతో ఏమి జరుగుతుందోనని భయం భయంగా గడిపాం. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం. పంజాబ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు బయలుదేరాం. – రంజిత్‌రెడ్డి, (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్
ఒక్కసారిగా భయంకర శబ్దాలు..
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వర్సిటీ సమీపంలో ఒక్కసారిగా భయంకర శబ్దాలు రావడంతో భయం వేసింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో యుద్ధం జరుగుతోందని అర్థమైంది. సోషల్ మీడియా మాకు అందుబాటులో లేదు. –కూచ వెంకట బాలాజీ (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్