
అభిప్రాయం
‘‘వ్యూహాత్మకంగా మన శత్రువులందరినీ మనం తృణీకరించవచ్చు. కానీ, తార్కికంగా మనం వారందరినీ సీరియస్‌గా తీసుకుని తీరాలి.’’ మావో జెడాంగ్ 1957లో చేసిన ఈ వ్యాఖ్య లోతైనది. ‘‘ప్రభుత్వ సౌజన్యంతో సాగే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తే, భారత్ ఆపరేషన్ సిందూర్–1 సందర్భంగా చూపిన సంయమనాన్ని ఈసారి ప్రదర్శించకపోవచ్చు, ఈసారి మేం మరో అడుగు ముందుకేసి, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాం. అది ప్రపంచ పటంలో తాము కొనసాగాలో వద్దో పాక్ ఆలోచించుకొనేటట్లు చేస్తుంది’’ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇటీవల అన్న మాటలు విన్నవెంటనే మావో వ్యాఖ్య గుర్తుకు వచ్చింది.
మొన్న మే నెలలో, స్వల్పకాలికమే అయినా నిర్ణయాత్మకమైన రీతిలో చేసిన పోరాటంలో పాక్ వైమానిక దళం ఎంతటి భారీ నష్టాన్ని చవిచూసిందీ భారత వైమానిక దళ చీఫ్ ఎ.పి.సింగ్ ఒక పత్రికా సమావేశంలో వివరించిన తర్వాత ద్వివేదీ నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడింది. భారత్ వైపు చోటుచేసుకున్నట్లు చెబుతున్న నష్టాలను సింగ్ తోసిపుచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా వారిద్దరి కేమీ తీసిపోనన్నట్లుగా మాట్లాడారు. వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా, భారత్ ఇచ్చే దీటైన జవాబు పాకిస్తాన్ ‘‘చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని రెండింటినీ’’ మార్చివేస్తుందని తన భుజ్ పర్యటనలో హెచ్చరించారు.
తానేం తక్కువ తినలేదు!
వీటిపై పాక్ అసాధారణమైన రీతిలో స్పందించింది. భారత దేశంలో ఏ మూలనైనా దాడి చేయగల సామర్థ్యం తమ సొంతమని ప్రకటించింది. ఒకవేళ అణ్వాయుధాలతో పాక్‌ను నిర్మూలించ దలిస్తే, అది పరస్పరమైనదిగా ఉంటుందని కుండబద్దలు కొట్టింది.
అణ్వాయుధ సంపత్తి కలిగిన పాకిస్తాన్ విఫల రాజ్యమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అది గత 40 ఏళ్ళుగా భారత్‌పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. చేబదుళ్ళు తెచ్చుకుంటూ రోజులు నెట్టు కొస్తోంది. అయినప్పటికీ, 6,60,000 బలగం కలిగిన పాక్ సైన్యాన్నీ, దాని అణ్వాయుధాలనూ భారత్ తేలిగ్గా తీసుకోవడానికి లేదు.ప్రపంచం పటం నుంచి తుడిచిపెట్టేస్తూంటే పాక్ అణ్వాయుధాలను ప్రయోగించకుండా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటుందను కోవడం అవివేకం.
అంత తేలికేం కాలేదు!
పాక్ విజయ తంత్రాలను 1965లో ఛేదించడంలో భారత్ సఫలమైన మాట నిజమే కానీ, ఆ యుద్ధం ఒక రకంగా డ్రాగా ముగిసింది. రెండు పక్షాలూ ప్రత్యర్థి భూభాగాల నుంచి చెరికొంత ప్రయోజనాలను మూటగట్టుకున్నాయి. ఇక, పాక్‌తో భారత్ 1947 – 48 యుద్ధాన్ని కొనసాగించి ఉంటే మొత్తం జమ్ము–కశ్మీర్ విముక్త మయ్యేదనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. దేశ విభజన రక్తపు చారికలు ఆరకముందే, ఒక దేశంగా ఇంకా పూర్తిగా పటిష్ఠం కాకముందే, ఆ యుద్ధం జరిగివుంటే మరింత వినాశకర పర్యవసానాలకు దారితీసి ఉండేది.
మనం 1971లో తూర్పున చేసిన యుద్ధం బ్రహ్మాండంగా విజ యవంతమైంది. కానీ, అది మనం ఓటమికి అణువంత అవకాశం కూడా ఇవ్వకూడని యుద్ధమనే సంగతిని మరచిపోకూడదు. ఈ విషయమై పాశ్చాత్యుల కథనం మాత్రం వేరు. పాక్ ఆకాశంలో సత్తా చూపలేక, చతికిలపడి ఉండవచ్చు. కానీ, క్షేత్ర స్థాయిలో మనం గడించిన లాభాలు అంతంతమాత్రమే! పైగా మనం ఛంబ్ (పీఓకే)ను కోల్పోవలసి వచ్చింది.
ఇక కార్గిల్ సంగతికొస్తే ఎత్తుగడ రీత్యా అది ఒక పరిమిత యుద్ధం. భారత్, పాక్ రెండూ అపుడు అణ్వాయుధ దేశాలు. భౌగో ళికపరంగా, తీవ్రత పరంగా యుద్ధాన్ని కొంత మేరకే పరిమితం చేయా లనే వ్యూహాన్ని న్యూఢిల్లీ అనుసరించింది. ఈ సందర్భంగా భారత్‌కు అంతర్జాతీయంగా లభించిన మద్దతు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా నుంచి లభించిన మద్దతు వల్ల కార్గిల్‌లోని మిగి లిన పర్వత శిఖరాల నుంచి పాక్ సేనలు తోక ముడవవలసి వచ్చింది.
2002లో నిర్వహించిన ‘ఆపరేషన్ పరాక్రమ్’ భారత్–పాక్ సేనల సమీకరణను చూసింది. కానీ, తొమ్మిది నెలల తర్వాత, తుది ఫలితం అనుకూలంగా వస్తుందనే పూచీ లేకపోవడం వల్ల, భారత్ దాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ముంబయ్‌పై 2008 దాడి నేపథ్యంలోనూ అదే రకమైన పరిణామం చోటుచేసుకుంది.
‘ఆపరేషన్ పరాక్రమ్’ ఉపసంహరణ తర్వాత, ఆ సారాంశాన్ని పర్వేజ్ ముషారఫ్ బాగా వివరించారు. ‘‘వారు (భారత్) మాపై దాడికి దిగరని, రెండు సైనిక శక్తులనూ బేరీజు వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. దాడికి దిగే సేన విజయం సాధించేందుకు సైనికపరంగా ఒక నిర్దిష్ట నిష్పత్తి అవసరం. మేం నిర్వహిస్తూ వస్తున్న ఆ నిష్పత్తులు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మరక్షణ చేసు కోవాల్సిన పక్షం తనను తాను కాపాడుకునేందుకు అవసరమైన దానికన్నా ఎక్కువ నిష్పత్తిలోనే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడేం మారిందని?
పాక్‌పై భారత్ పదాతి దళాలతో దాడికి దిగితే విజయం ఖాయ మని సూచించేంతగా సంఖ్యలు, మోహరణలు, రక్షణ సామగ్రి పరంగా పరిస్థితిలో తేడా ఏమీ రాలేదు. మనం ఎంత చక్కగా సమా యత్తమై, ప్రేరణతో ఉన్నామో, అవతలి పక్షంవారు కూడా అలాగే ఉన్నారు. పైగా, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సేనల మోహరింపును ఎదుర్కొనేందుకు గడచిన ఐదేళ్ళుగా భారత్ తన సేనల కదలికలను నిశితంగా మార్చుకోవాల్సి వస్తోంది.
‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో, పాకిస్తానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ప్రధాని మోదీ నూతన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు. పాక్‌ను శిక్షించేందుకు అణు, సంప్రదాయ ఘర్షణల మధ్య తేడాను మెరుగైన రీతిలో వినియోగించుకోవాల్సి ఉందని ఆ మార్గదర్శక సూత్రాలు డిమాండ్ చేస్తున్నాయి. నాశనమైపోతారు జాగ్రత్తంటూ ప్రత్యర్థులను హెచ్చరించే బదులు, ప్రధాని చెప్పినట్లు నడచుకునేందుకు తగిన వ్యూహాలను పన్నడంపై సైన్యాధికారులు దృష్టి కేంద్రీకరించాలి.
మనోజ్ జోషీ
వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్’లో విశిష్ట పరిశోధకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)