
భారత ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినట్లయితే ఈ ఏడాది డిసెంబరులో విజయ్ మాల్యా, వచ్చే ఫిబ్రవరిలో నేను, మే నెలలో మా మామయ్య మెహుల్ చోక్సీ... ముగ్గురం ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో మా తొలి బర్త్‌డేలు జరుపుకొంటాం అనుకుంటా!
జైల్లో నేను 55 లోకి, మామయ్య మెహుల్ చోక్సీ 67లోకి, విజయ మాల్యా 70లోకి అడుగు పెడతాం. ఏడాది నుంచి ఏడాదిలోకి అడుగు పెట్టడమే కానీ, మేమిక ఆర్థర్ రోడ్ జైలు నుండి బయటికి అడుగుపెట్టడం అనేదే ఉండదని భారతీయ శిక్షా స్మృతి ప్రకారం నా మనసుకు అనిపిస్తోంది.
నేను 2019 నుండీ లండన్ జైళ్లలో ఉంటున్నాను. మాల్యా 2016 నుండీ లండన్ వీధుల్లో చల్లటి బీరు తాగుతూ బెయిల్ మీద ఉంటున్నారు. ఆయన ఒక్కసారీ జైల్లో లేరు. నాకు ఒక్కసారీ బెయిల్ రాలేదు. మామయ్య మెహుల్ చోక్సీని ఐదు నెలల క్రితమే... బెల్జియంలో అరెస్ట్ చేసి అక్కడే జైల్లో ఉంచారు. మోచేతి కర్రతో ఆయన నడుస్తుండటం ఫొటోల్లో చూసి నా మనసు చివుక్కు మంది. విధి ఎవర్ని ఎలా నడిపిస్తుందో ఊహించలేం.
నేరం అన్నది చట్టం దృష్టిలో క్రూరమైనదే కావచ్చు. కానీ, నేరం కంటే క్రూరమైనది చట్టం. ఈ మాటనే 2019లో ఒకసారి, 2021లో ఒకసారి ఫోన్‌లో నేను మాల్యాతో అన్నప్పుడు, రెండుసార్లూ మాల్యా ఒక్క క్షణం ఆగి, పెద్ద పెట్టున నవ్వారు.
‘‘ఎందుకలా ఒక్క క్షణం ఆగారు మాల్యాజీ?’’ అని అడిగాను.
‘‘బీరు పొలమారింది’’ అన్నారు.
‘‘మరి ఎందుకలా పెద్ద పెట్టున నవ్వారు మాల్యాజీ?!’’ అన్నాను.
‘‘ఇంత వయసు వచ్చినా నాకు బీరును పొలమారకుండా తాగటం రానందుకు నవ్వొచ్చింది’’ అన్నారు!
ఆ తర్వాతెప్పుడూ నేను చట్టం–నేరం అంటూ మాల్యాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. మధ్యలో మాల్యానే 2023లో ఒకసారి నాకు ఫోన్ చేశారు.
‘‘ఎక్కడున్నావ్?’’ అన్నారు.
‘‘ఇదిగో ఇప్పుడే సౌత్ వెస్ట్ లండన్ నుంచి, సౌత్ ఈస్ట్ లండన్ కి వచ్చాను మాల్యాజీ’’ అని చెప్పాను.
‘‘వావ్ వావ్... బెయిల్ వచ్చేసిందా!’’ అని చాలా సంతోషంగా అడిగారు మాల్యా. ఒకరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారిలో మాత్రమే అంతగా సంతోషం పొంగి పొర్లుతుంది.
‘‘బెయిల్ కాదు కానీ, బెయిల్ లాంటిదే మాల్యాజీ. కరడుగట్టిన నేరస్థులతో కిక్కిరిసి ఉండే ‘హిజ్ మెజెస్టీస్ ప్రిజన్ ’ వాండ్స్‌వర్త్ నుంచి కొంచెం శుభ్రంగా ఉండే ‘హిజ్ మెజెస్టీస్ ప్రిజన్ ’ థేమ్స్‌సైడ్‌కు నన్ను షిఫ్ట్ చేశారు అన్నాను.
‘‘అవునా... ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’’ అన్నారు మాల్యా. కొత్త సంతోషం పాత బాధల్ని మరిపిస్తుందని!
నవంబర్ 23న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో నా ‘అప్పగింత’ కేసు హియరింగ్. ‘‘నీరవ్‌ని మాకిచ్చేయండి ‘ప్రేమగా’
చూసుకుంటాం’’ అని ఇండియా అంటోంది.
మొదట నేను, నా వెనుకే మామయ్య, ఆ వెనుకే మాల్యా వరుసగా ఒక్కొక్కరం
ఇండియా ప్రేమకు పాత్రులం అవక తప్పేలా లేదు.
బ్రేక్‌లో నా సెల్ నుంచి బయటికి వచ్చి మాల్యాకు ఫోన్ చేశాను.
‘‘హా... నీరవ్! నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా... బెల్జియం నుంచి నాకొక డాజిలింగ్, రేడియంట్, సింటిలేటింగ్,
గ్లిజనింగ్, లస్ట్రస్... డైమండ్ నెక్లెస్ సెట్టును స్పెషల్‌గా తయారుచేయించి తెప్పించగలవా? ఫిబ్రవరిలో పింకీ బర్త్ డే ఉంది’’ అన్నారు!
పింకీ... మాల్యా గర్ల్ ఫ్రెండ్.
నేనిక్కడ జైల్లో మా ముగ్గురి ‘ఆర్థర్ రోడ్’ బర్త్‌డేల గురించి ఆలోచిస్తుంటే, మాల్యా అక్కడ బెయిల్లో తన గర్ల్‌ఫ్రెండ్ గ్రాండ్ బర్త్‌డే గిఫ్ట్ గురించి ప్లాన్ చేస్తున్నారు!