
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు.. సరదా అంతకంటే కాదు. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ మనోజ్ నరవణే చేసిన అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధం ఎల్లప్పుడు ఆఖరి ఆస్త్రం మాత్రమే కావాలని అన్నారు. అయితే.. ఇక విశ్రాంత మిలటరీ అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నేతల మాటలకు మధ్య తేడా ఉండటమే సమస్య అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో పాక్‌కు గట్టి హెచ్చరికలే చేసినప్పటికీ వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు మాత్రం బదులిచ్చినట్లు కనిపించదు.
👉ఆపరేషన్ సింధూర్‌ను హఠాత్తుగా ఎందుకు ఆపేశారు అన్నది వీటిల్లో ఒకటి. మిలటరీ అధికారుల స్థాయిలో పాక్ శరణు కోరినంత మాత్రాన అంగీకరించడం సబబేనా అన్నది కొందరి అనుమానం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం జరగాల్సిందేనని దేశ ప్రజలు వాంఛించిన మాట వాస్తవం. అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం సాగించిన అపరేషన్ సింధూర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిసింది. కానీ యుద్ధం ఆకస్మిక నిలిపివేత.. పహల్గామ్ దాడికి దారితీసిన నిఘా వైఫల్యాల వంటివి మాత్రం ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
👉కశ్మీర్‌లో కాల్పులు కొత్త కాకపోవచ్చు. పాక్ సైన్యం జరిపే కవ్వింపు కాల్పులు, చొరబాట్ల కోసం ఉగ్రవాదులు అప్పుడప్పుడూ భారత సైన్యంపైకి కాల్పులు జరుపుతూనే ఉంటారు. అయితే పహల్గామ్ మాత్రం రాక్షస కృత్యం. అమాయకులైన టూరిస్టులను, అది కూడా పేర్లు అడిగి మరీ హిందువులను హత్య చేయడంపై దేశం యావత్తు ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను ఆకస్మికంగా విరమించుకుని వెనక్కు రావడం, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం వరకూ బాగానే ఉంది. కానీ.. ఆ వెంటనే బీహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం మాత్రం చాలామందికి ముఖ్యంగా ప్రతిపక్షాలకు రుచించలేదు. అయినా సరే.. పాక్‌పై మోడీ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేశాయి.
👉ఈ తరుణంలో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిమ్మట భారత సైన్యం ఉగ్ర శిబిరాలను విజయవంతగా ధ్వంసం చేసి వచ్చింది. సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులలో కాల్పులకు, ఇతరత్రా దాడులకు పాల్పడడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అంతేకాక రావల్పిండి, తదితర పాక్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. నిజానికి భారత్ సైనిక శక్తి ముందు పాక్ ఎందుకు కొరగాదన్నది వాస్తవం. ఈ సమయంలో కేంద్రంలోని పెద్దలు కాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాని యుద్దం చేయబోతున్న సంకేతాలు ఇచ్చారు. మనం తలచుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదని, అసలు పాక్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ప్రకటనలు చేశారు.
👉వీటి ఆధారంగా చాలా మంది యుద్దం ఆరంభమైనట్లే భావించారు. సాంకేతికంగా భారత్ యుద్ధ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇకపై పాక్ నుంచి ఎలాంటి చికాకు ఎదురుకాకుండా పీఓకే మన ఆధీనంలోకి వస్తుందని భావించారు. పాక్ నాలుగుగా చీలిపోయే అవకాశం ఉందని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆకస్మాత్తుగా పాక్ మిలటరీ శరణు కోరడంతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించామని మోదీ చెప్పడంతో అప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు, జరిగిన పరిణామాలకు మధ్య తేడా రావడంతో కేంద్రంపై విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణతో మోదీ ప్రభుత్వం సాధించంది ఏమిటి? అని విపక్షాలు ప్రశ్నించాయి.
👉ఈ లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి ఇదంతా తన ఘనత అని చెప్పుకోవడం మరింత చికాకైంది. దానిని విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ, ప్రధాని బహుశా దౌత్యనీతి లేదా మరే కారణం వల్లనో తన ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. కశ్మీర్ విషయంలో మూడో పక్ష రాయబారానికి అంగీకరించబోమని భారత్ చెబుతుండగా, ట్రంప్ తాను మధ్యవర్తిత్వం చేస్తానని అనడం బాగోలేదు. అంతేకాక, అమెరికా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి భారత్, పాక్‌లను ఒకే దృష్టితో చూడడం ఆశ్చర్యపరిచింది. భారత్ విదేశాంగ విధానంలో ఏమైనా లోపం ఉందా అన్న ప్రశ్నకు తావిచ్చింది. మరో వైపు పాకిస్తాన్ పహల్గామ్ దుశ్చర్యతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెప్పింది.
👉ఆ ఉగ్ర ముష్కరులను భారత భద్రత దళాలు పట్టుకుని, వారి మూలాలు అన్నిటిని చెప్పగలిగి ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరై ఉండేది. వారికి పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా కూడా బహిరంగంగా పాక్‌ను తప్పు పట్టవలసి వచ్చేది. అయితే పాకిస్తాన్ భారతదేశం వద్ద ఉన్న ఎస్.4 సుదర్శన రక్షణ కవచాన్ని ఏమీ చేయలేక పోయిందన్న విషయాన్ని మోదీ అన్ని దేశాలకు తెలిసేలా అదంపూర్ వెళ్లి ఆ బేస్ నుంచి ప్రసంగించడం బాగుందని చెప్పాలి. అలాగే భారత్‌కు ఉన్న స్వదేశీ పరిజ్ఞాన ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలు కూడా దేశ ప్రతిష్టను పెంచాయి. అయినప్పటికీ యుద్దం ఎందుకు ఆగిందన్నది సగటు భారతీయుడికి ఎదురయ్యే ప్రశ్న.
👉దానికే మాజీ ఆర్మీ ఛీప్ నరవణే ఇచ్చిన ప్రకటన అర్థవంతమైన జవాబు అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు..అది చివరి అస్త్రం కావాలన్న ఆయన మాటలు అక్షర సత్యం. పాక్‌కు భారీ నష్టం జరిగినా, మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. భారత సైన్యం సాధించిన విజయానికి సెల్యూట్ చేద్దాం. యుద్ధం జరగాలని కోరుకునేవారు కొంత అసంతృప్తికి గురై ఉండవచ్చు.. మిలటరీ ఆపరేషన్స్ వరకు ప్రామాణికంగా తీసుకుంటే భారత్ గొప్ప విజయం సాదించిందని ఒక రిటైర్డ్ మేజర్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు భావోద్వేగ అంశాలపై బాధ్యతతో మాట్లాడకపోతే అవి ఆత్మరక్షణలో పడతాయని కూడా ఈ అనుభవం తెలుపుతోందని అనుకోవచ్చు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత