
న్యూఢిల్లీ: ఈనెల (అక్టోబర్) 24న జమ్ముకశ్మీర్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి బీజేపీ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఆదివారం వెల్లడించింది. వీరిలో జమ్ముకశ్మీర్ యూనిట్ అధ్యక్షుడు సత్ పాల్ శర్మ ఒకరు. జేకేలో జరగనున్న 2025 ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మూడు వేర్వేరు నోటిఫికేషన్ల కింద ఆమోదం తెలిపిందని జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్ అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థుల జాబితాలో సత్ పాల్ శర్మతో పాటు గులాం మొహమ్మద్ మీర్, రాకేష్ మహాజన్ ఉన్నారు. నాలుగు స్థానాలకు ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ మూడు వేర్వేరు నోటిఫికేషన్‌లను జారీ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి మూడు స్థానాల్లో ఆధిక్యం ఉండగా, అసెంబ్లీలో వారి బలం ఆధారంగా బీజేపీకి ఒక స్థానం ఉంది. శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వారిలో చౌదరి ముహమ్మద్ రంజాన్, సజాద్ కిచ్లూ, షమీ సింగ్ ఒబెరాయ్ ఉన్నారు. మరో స్థానానికి కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने जम्मू एवं कश्मीर में होने वाले तीन अलग-अलग अधिसूचना के द्विवार्षिक राज्य सभा चुनाव 2025 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/KJFjE5KjAl
— BJP (@BJP4India) October 12, 2025
రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 13. 2021, ఫిబ్రవరి నుండి ఖాళీగా ఉన్న స్థానాలకు అక్టోబర్ 24న ఎన్నికలు జరగనుండగా, అదే రోజున కౌంటింగ్ కూడా జరగనుంది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులున్నారు. ఎన్‌సీ-కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామ్యంలో 52 మంది సభ్యులు, బీజేపీ 28, పీడీపీ 3, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఒకరు, అవామి ఇత్తెహాద్ పార్టీలో ఒకరు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉన్నారు.