సందర్భం
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం ‘జెన్–జీ’. 1995 నుంచి 2010 మధ్యలో జన్మించిన ఈ ‘జెన్–జీ’ గురించి 2025లో ప్రపంచమంతా మాట్లాడుకుంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రతి ఇంటా చర్చ జరిగింది. వీరి ఉద్యమాన్ని కొందరు సానుకూలమైన అంశంగా గమనించారు. స్వాతంత్య్రం, స్పష్టత, మార్పు తదితర అంశాలపై యువత ఆలోచిస్తున్న తీరునూ, ఏకతాటిపైకి వచ్చి పోరాడిన తీరునూ అభినందించారు. మరికొందరు... యువతలో హఠాత్తుగా పెరుగు తున్న నిరాశ, నిస్పృహలకు కారణంగా నేపాల్, మడగాస్కర్ దేశాల ఘటనలను ఉదాహరణలుగా చెబుతున్నారు.
ఇలాంటి భిన్నమైన వాదనలను పక్కనపెడితే... ప్రపంచ వ్యాప్తంగా యువశక్తి ఆశలు, ఆకాంక్షలతో పాటుగా వారి సామర్థ్యం పెరుగుతోంది. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలన్న పట్టుదల, అంకితభావం పెరుగుతోందనేది నిర్వివాదాంశం. భారత దేశంలోనూ విపక్ష పార్టీ సభ్యులు కొందరు... ఇక్కడి ‘జెన్–జీ’ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా తమ శక్తిసామర్థ్యాలను సమాజ పురోగతి కోసం, దేశాభివృద్ధి కోసం వినియోగిస్తూ... స్పష్టమైన ఆలోచనలతో ‘వికసిత భారత నిర్మాణం’లో భాగస్వాములవుతున్నారు.
భారత యువత ‘వివేకం’
నేటి ప్రపంచం ‘జెన్–జీ’ గురించి మాట్లాడుతోంది. కానీ,వందేళ్ల క్రితమే స్వామి వివేకానంద యువత సామర్థ్యం, వారికి సరైన మార్గదర్శనం చేయడం ద్వారా దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం ఎలా ఉండాలనేదానిపై ఆలోచించారు. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యువత గురించి మాట్లాడినా... వివేకానందుడి బోధనల గురించి ప్రస్తావించకుండా ఆ సమావేశం సంపూర్ణం కాదు. అంతటి గొప్ప దీర్ఘదర్శి స్వామి వివేకానంద. ఇవాళ (జనవరి 12) వారి 164వ జయంతి. ‘జెన్–జీ’ సామర్థ్యానికి మరింత పదునుపెట్టి... వికసిత భారత నిర్మాణంలో వారిని భాగ స్వాములను చేసే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సంద ర్భమిది. వ్యక్తిత్వం, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చు కోవడం, స్వీయ అవగాహన, సంస్కృతి–సంప్రదాయాలపై గౌరవం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ నిర్మాణంలో మనం ఏం చేయాలనే అనేక అంశాలపై వివేకానందుని బోధనల ప్రభావం ఉంటుంది.
వివేకానందుడు వందేళ్ల క్రితం ఉద్బోధించిన ఆధునిక దృక్పథం, నాగరికత విలువల పునాదులు మొదలైన విషయాలన్నీ... నేటి భారత యువతలో కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాల్లోని యువత ప్రధాన స్రవంతి (మెయిన్ స్ట్రీమ్) నుంచి దూరంగా వెళ్తున్నప్పటికీ, వీరంతా భావిభారత నిర్మాణంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. స్వచ్ఛ భారత్, మేరీ మాటీ మేరా దేశ్ (మొక్కల పెంపకం), నషా ముక్త్ భారత్ (మాదక ద్రవ్యాల విని యోగ రహిత భారతం) వంటి ఎన్నో ప్రజాచైతన్య కార్యక్రమాలకు యువతే నేతృత్వం వహించి వాటిని విజయవంతం చేస్తోంది.
నవీన సాంస్కృతిక సారథులు
ఆధునిక సాంకేతికత వినియోగంలోనూ, స్టార్టప్‌ల రూపకల్పన లోనూ మన యువత సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ‘ఇండియా స్టాక్’ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పరిజ్ఞానాన్ని కూడా యువత స్వీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా వినూత్న మార్కెట్ పరిష్కారాలకు బాటలు వేయడం, యూనికార్న్ (రూ.వందకోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టే స్టార్టప్)ల ఏర్పాటు వంటి వాటి ద్వారా ఉద్యోగాల సృష్టికర్తలుగా వారి పాత్రను మరింత బలోపేతం చేసుకుంటున్నారు.
యువత సంస్కృతికి దూరంగా వెళ్తోందనే దుష్ప్రచారం జరుగు తోంది. కానీ ఆధ్యాత్మిక మూలాలను తెలుసుకోవడంపై, మన వైభవోపేతమైన చరిత్రను అధ్యయనం చేయడంపై యువత మక్కువ చూపుతోంది. 2022 ఆగస్టు 15 నాడు... దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా... ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పంచ్ ప్రాణ్ (5 తీర్మాణాల) గురించి వివరించారు. ప్రతి భారతీయుడూ తన లోని బానిస మనస్తత్వపు ఆలోచనలను తొలగించుకుని... మన సంస్కృతీ సంప్రదాయాలు, ఘనమైన చరిత్ర పట్ల గర్వపడాలని సూచించారు. అందుకే యువత... ఓవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే... మరోవైపు భారతీయ నాగరి కత మూలాలను, మన విలువలతో కూడిన సంప్రదాయాల సారాన్ని గ్రహించి ఆచరణలో పెట్టే దిశగా కృషి చేస్తోంది.
ఇవాళ యువత ఆధ్యాత్మిక పర్యాటకం, భారతీయ తాత్వికతపై ఆసక్తిని కనబరుస్తోంది. యోగా, శాస్త్రీయ సంగీతం, ఇతర సాంస్కృతిక పద్ధతులను అలవర్చుకుంటోంది. 2025లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగిన ‘కుంభమేళా’లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఈ ఏడాది కొత్త సంవత్సరాన్ని జరుపుకొనేందుకు వేలాదిమంది ‘కాశీ విశ్వనాథ మందిరాన్ని’ ఎంచుకోవడం... యువతలో వస్తున్న పరివర్తనకు ఉదాహరణలు.
రాజకీయాల్లో యువశక్తి
దీని కారణంగా యువత ఆలోచనల్లోనూ సానుకూలమైన మార్పు కనబడుతోంది. దేశ రాజకీయ, సంస్థాగత అంశాలపై దీని ప్రభావం స్పష్టంగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా... యువత ఆకాంక్షలకు పెద్దపీట వేస్తున్నాయి. నాయకత్వంలోనూ యువ భారతానికి ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. 2024లో దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత... రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. దీన్ని ఆచరణలో పెడుతూ, ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం ప్రారంభమైంది.
దేశ యువత ఏమనుకుంటోందో తెలుసుకునేందుకు ప్రధానమంత్రి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. వారి ఆకాంక్షలను, వారి ఆలోచనలను, వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ కూడా... ఇటీవలి కాలంలో యువ నాయకులకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పజెబుతోంది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యువకుడిని నియమించింది. రాజకీయంలో పెద్దలకు ఉండే అనుభవాన్ని యువత జోరు, వారి ఆవిష్కరణల సామర్థ్యంతో సమతుల్యం చేయాలన్న ప్రధాని ఆలోచనలకు కార్యరూపం ఇది.
దేశ యువశక్తి బలం, క్రమశిక్షణ, నైతికతలోనే భారతదేశ పునరుజ్జీవనం ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవాళ అక్షరసత్యాలుగా మనముందున్నాయి. ఈ ‘జెన్–జీ’పై, యువశక్తిపై ప్రబలమైన విశ్వాసంతోనే... 2047 నాటికి వికసిత భారత నిర్మాణం జరగాలనే సంకల్పాన్ని ప్రధాని దేశం ముందుంచారు. ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక సాంకేతికతకు వారథులుగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ‘జెన్–జీ’ పాత్ర అత్యంత కీలకం. అందుకే స్వామి వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ, భారతదేశాన్ని మళ్లీ విశ్వగురువుగా నిలబెట్టుకునేందుకు... ఆధునిక, ఆధ్యాత్మిక భారతాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు ప్రధాన మంత్రి సంకల్పించిన మహాయజ్ఞంలో మనమంతా భాగస్వాము లమవుదాం!
జి. కిషన్ రెడ్డి
వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
(నేడు స్వామి వివేకానంద జయంతి; జాతీయ యువజన దినోత్సవం)


