
న్యూఢిల్లీ: ‘నాడు ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ చేపట్టాలనేది సమిష్టి నిర్ణయం అని, దీనిలో సైన్యం, పోలీసులు, నిఘా, పౌర సేవా రంగాలు పాల్గొన్నాయని, ఈ విషయంలో ఇందిరా గాంధీని మాత్రమే నిందించలేమని’ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం అన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం 1984 నాటి ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ను ప్రస్తావించారు. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని తిరిగి దక్కించుకునేందుకు అనుసరించిన తప్పుడు మార్గంగా ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ను ఆయన అభివర్ణించారు. అయితే నాటి సమిష్టి నిర్ణయానికి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ మూల్యం చెల్లించారని చిదంబరం పేర్కొన్నారు.
1984, జూన్‌లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో చొరబడిన ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు ఉద్దేశించిన ఆర్మీ ఆపరేషన్ గురించి చిదంబరం మాట్లాడుతూ నాటి నిర్ణయం ఇందిరా గాంధీ ఒక్కరే తీసుకోలేదని స్పష్టం చేశారు. అది సమిష్టి నిర్ణయం అని, ఇందిగా గాంధీని మాత్రమే నిందించలేమని అన్నారు. అనంతరం పంజాబ్ గురించి మాట్లాడిన ఆయన ఖలిస్తాన్ ఉద్యమాలు చాలావరకు తగ్గిపోయాయని, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులే ఆ రాష్ట్రానికి ప్రధాన సమస్యగా మారాయని అభిప్రాయపడ్డారు.
ఆపరేషన్ బ్లూ స్టార్
ఆపరేషన్ బ్లూ స్టార్ 1994, జూన్ ఒకటి నుండి జూన్ ఎనిమిది వరకు జరిగింది. ఆ సమయంలో ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం పంజాబ్‌కు చెందిన జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే నేతృత్వంలోని వేర్పాటువాద తిరుగుబాటును అణిచివేయడానికి ప్రయత్నించింది.
అకల్ తఖ్త్, స్వర్ణ దేవాలయ సముదాయంలోకి చొరబడిన భింద్రాన్‌వాలే, అతని అనుచరులను తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. దీనిలో ట్యాంకులు, భారీ ఫిరంగిదళాలు పాల్గొన్నాయి. ఫలితంగా ఉగ్రవాదులు, సైనికులు, పౌరులు మరణించారు. ఈ దాడి సిక్కు సమాజాన్ని తీవ్రంగా బాధించింది. వారిలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. 1984 అక్టోబర్ 31న, స్వర్ణ దేవాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేశారు. అనంతరం భారతదేశం అంతటా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి.