
అందుకు మూల్యంగా ఇందిరాగాంధీ తన జీవితాన్నే కోల్పోయారు
ఆ ఉగ్రవాదుల ఏరివేత నిర్ణయం ఇందిర ఒక్కరిదే కాదు
సైన్యం, ఇంటెలిజెన్స్, పోలీస్, సివిల్ డిఫెన్స్ సంయుక్త నిర్ణయం
అందుకు ఇందిరను ఒక్కరినే తప్పుపట్టడం సరికాదు
కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం వ్యాఖ్య
సీనియర్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి: కాంగ్రెస్
అది ఇందిరాగాంధీ రాజకీయ దుస్సాహసం: బీజేపీ
సిమ్లా: సిక్కులకు పరమ పవిత్రమైన అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో తిష్ట వేసిన సిక్కు వేర్పాటువాదులను ఏరివేసేందుకు 1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమలుచేసిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. వేరే విధంగా ఉగ్రవాదులను లొంగదీసుకునే మార్గం ఉన్నా, బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. ఆ తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చిదంబరం వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తంచేయగా, కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది.
ఇందిర ఒక్కరి నిర్ణయం కాదు
ఆపరేషన్ బ్లూస్టార్ ఇందిరాగాంధీ ఒక్కరి నిర్ణయం కాదని పీ చిదంబరం తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో నిర్వహించిన కుశ్వంత్‌సింగ్ లిటరరీ ఫెస్టివల్‌లో శనివారం ఆయన పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత హరిందర్‌సింగ్ భవేజా రాసిన తన అనుభవాలు, జ్ఞాపకాల సంకలనం ‘దె విల్ షూట్ యూ మేడం: మై లైఫ్ త్రూ కాన్‌ఫ్లిక్ట్’ ఆవిష్కరణ సందర్భంగా భవేజాతో చర్చలో చిదంబరం పాల్గొన్నారు. ‘మిలిటెంట్లను తరిమివేసేందుకు (గోల్డెన్‌టెంపుల్ నుంచి) వాళ్లందరీ నిర్బంధించేందుకు వేరే మార్గాలు ఉన్నాయి.
కానీ, ఆపరేషన్ బ్లూస్టార్ తప్పుడు మార్గం. ఆ పొరపాటుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించారని నేను అంగీకరిస్తాను. అయితే, ఆ నిర్ణయం ఇందిరాగాంధీ ఒక్కరిదే కాదు. సైన్యం, నిఘా వర్గాలు, పోలీసులు, సివిల్ డిఫెన్స్ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం. అందువల్ల ఇందిరాగాంధీని ఒక్కరినే పూర్తిగా నిందించటం సరికాదు. ఇక్కడ ఏ సైన్యాధికారినీ తప్పుబట్టం లేదు. కానీ, ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన కొన్నాళ్ల తర్వాత మిలిటరీ ప్రమేయం లేకుండా ఉగ్రవాదులను ఎలా లొంగదీసుకోవచ్చో మేం చూపించాం’ అని చిదంబరం అన్నారు.
ఏమిటీ ఆపరేషన్ బ్లూస్టార్
పంజాబ్‌ను స్వంతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సిక్కు వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలే నాయకత్వంలో వందలమంది సాయు«ధులు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో తిష్టవేశారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వారిని అంతమొందించేందుకు 1984 జూన్ 1 నుంచి 10 వరకు ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో సైనిక చర్య చేపట్టింది.
సైనికులు బూట్లు, ఆయుధాలతో గోల్డెన్ టెంపుల్‌లోకి ప్రవేశించటంతో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చి చంపారు. అయితే, 1986, 88లో కూడా స్వర్ణ దేవాలయంలో సిక్కు వేర్పాటువాదులు స్వర్ణ దేవాలయంలో తిష్టవేశారు. అప్పుడు సైనిక చర్య లేకుండానే వారిని ప్రభుత్వం లొంగదీసుకుంది.
కాంగ్రెస్ అసహనం.. బీజేపీకి అవకాశం
చిదంబరం వ్యాఖ్యలపై సొంతపార్టీ కాంగ్రెస్ నేరుగా స్పందించకపోయినా.. తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానం తీవ్ర మనస్తాపం చెందిందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. ‘పార్టీ నుంచి పదవులు, అవకాశాలు అన్నీ పొందిన సీనియర్ నాయకులు ఏవైనా ప్రకటనలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పార్టీకి ఇబ్బందులు కలిగించేలా మాట్లాడవద్దు. అలా మాట్లాడటం అలవాటుగా అస్సలు మారకూడదు.
పార్టీ అగ్ర నాయకత్వంతోపాటు పార్టీ మొత్తం తీవ్రంగా కలత చెందింది (చిదంబరం వ్యాఖ్యలతో). పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై ఆగ్రహంగా ఉంది’ అని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ముంబైపై 2008లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంతో యుద్ధం చేయాలని భావించినా, అమెరికా అడ్డుకోవటం వల్లే ఆగిపోయామని చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించేందుకు బీజేపీకి చిదంబరం వ్యాఖ్యలు మంచి అవకాశంగా మారాయి. కాంగ్రెస్ తప్పిదాలను చిదంబరం చాలా ఆలస్యంగా అంగీకరిస్తున్నారు.
ముంబై దాడుల తర్వాత అమెరికా, అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్లనే పాకిస్తాన్‌తో యుద్ధం చేయకుండా వెనక్కు తగ్గామని మొన్ననే తెలిపారు. ఇప్పుడు ఆపరేషన్ బ్లూస్టార్ కూడా తప్పిదమని ఒప్పుకున్నారు’ అని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. నిజాన్ని చరిత్ర కచ్చితంగా రిక్డారు చేయాలి. ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టడం నాడు జాతీయ అత్యవసరం కాదు. అది రాజకీయ దుస్సాహసం. ఒక జాతీయవాదిగా ఆపరేషన్ బ్లూస్టార్ పూర్తిగా అవసరం లేని చర్య అని నేను భావిస్తున్నా. చిదంబరం నిజమే చెప్పారు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ పేర్కొన్నారు.