
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కొందరు నేతలు కొనియాడగా.. మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన చేయడంతో ఎలక్షన్ స్టంట్ అని కామెంట్స్ చేశారు.
జీఎస్టీ సంస్కరణల గురించి కాంగ్రెస్ నాయకులు చిదంబరం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా చిదంబరం.. ‘వివిధ వస్తువుల రేట్ల తగ్గింపు స్వాగతించదగినది. కానీ, ఎనిమిది సంవత్సరాలుగా చాలా ఆలస్యం జరిగింది. జీఎస్టీ రూపకల్పన, రేట్లకు వ్యతిరేకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా మేం పోరాడుతున్నాం. కానీ మా విన్నపాలు పట్టించుకోలేదు. బీహార్ ఎన్నికలకు ముందు ఇలా ప్రకటన రావడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ట్రంప్ టారిఫ్‌లా కోసం చేశారా? లేక బీహార్ ఎన్నికల కోసమా? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా జీఎస్టీ సంస్కరణల గురించి ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. ‘ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తర్వాత సాధించిన సామాన్య ప్రజల విజయం’ అని అభివర్ణించింది. కేంద్రంలోకి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు.. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. ఇకపై జీఎస్‌టీలో 5, 18 శాతం పన్ను శ్లాబులే ఉంటాయి. 12 శాతం, 28 శాతం శ్లాబుల్లోని వస్తువులు 5, 18 శాతం శ్లాబుల్లోకి మారనున్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలపై ప్రత్యేక పన్ను రేటు 3 శాతం ఇక ముందూ కొనసాగనుంది.
సెప్టెంబర్ 22 నుంచే (దేవీ నవరాత్రి వేడుకలు మొదలయ్యే రోజు) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. కార్మికుల ఆధారిత రంగాలకు చక్కని మద్దతు లభిస్తుంది. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం ప్రయోజనం పొందుతాయి. ఆర్థిక వ్యవస్థలోని కీలక చోదకాలకు ప్రాధాన్యం ఇచ్చాం’ అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.