కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ వెల్లడి
చిలీ మాజీ అధ్యక్షురాలు మిషెల్ బచెలెట్‌కు ‘ఇందిరా గాంధీ’బహుమతి
న్యూఢిల్లీ: దేశ తొలి, ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేశారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్టు చైర్‌పర్సన్ సోనియా గాంధీ శ్లాఘించారు. పేదరికం, అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేశారని, ఆమె తన అత్యుత్తమ విధానాలతో దేశ దశదిశను మార్చేశారని కొనియాడారు.
2024 సంవత్సరానికి గాను ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి’ని చిలీ దేశ తొలి, ఏకైక మహిళా అధ్యక్షురాలిగా సేవలందించిన మిషెల్ బచెలెట్‌కు బుధవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రసంగించారు. అసాధారణ మహిళా నేతల్లో ఒకరైన ఇందిరా గాంధీ స్మారకార్థం 1985లో ఈ బహుమతిని ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రతికూల సమయంలోనూ న్యాయం, అభివృద్ధి, మానవాళి సంక్షేమం కోసం పోరాటం సాగించిన ఘతన ఇందిరా గాం«దీకి దక్కుతుందని అన్నారు. సామాజిక ప్రగతి, శాంతి, సుస్థిరత కోసం కృషి చేసినవారికి ఈ బహుమతి అందజేస్తున్నట్లు వెల్లడించారు. పేదరికం, వ్యాధులు, అజ్ఞానంపై మరో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకు శాంతి కావాలని ఇందిరా గాంధీ చెప్పినట్లు సోనియా గుర్తుచేశారు.
పీడన, పక్షపాతం, పేదరికం, హింసకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందన్నారు. దేశానికి ఇందిరా గాంధీ అందించిన మహోన్నత సేవలు చిరస్మరణీయమని ఉద్ఘాటించారు. తనకు ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని ప్రదానం చేసినందుకు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్టుకు మిషెల్ బచెలెట్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇందిరా గాంధీ జీవితం, ఆమె అందించిన సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.


