ఆ పిల్లాడికి నిండా పదేళ్లు కూడా లేవు. ఏది మంచో.. ఏది చెడో తెలిసే వయసూ కాదు. అయితే ఆ చిరుప్రాయంలోనే ..ఆ పిల్లాడు తన దేశభక్తిని చాటుకున్నాడు. పుట్టిన గడ్డ మీద ఉన్న ప్రేమతో తన దేశాన్ని రక్షించేవారికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు.ఎంతో ప్రమాదకర సమయంలోనూ ఎటువంటి భయం లేకుండా సైనికుల వద్దకు వెళ్లి వారి దాహర్తిని తీర్చేలా నీరు, బట్టర్ మిల్క్ అందించాడు. దీంతో అతని సేవలకు మెచ్చిన ప్రభుత్వం ఆయనను రాష్ట్రీయ బాల పురస్కారంతో సత్కరించింది.
ఆపరేషన్ సిందూర్ భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మిషన్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ప్రపంచం మెుత్తానికి భారత్‌ని రెచ్చగొడితే సమాధానం ఎలా వస్తుందనే విషయం అర్థమైంది. అయితే ఆపరేషన్ సమయంలో ఒక స్ఫూర్తిదాయక దేశభక్తి ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఉగ్రమూకలతో పోరాడుతూ తమ గ్రామంలోకి వచ్చిన సైనికులకు శ్రావణ్ సింగ్ అనే 10 ఏళ్ల బాలుడు సహాయం చేశారు. తమ దేశం కోసం పోరాడుతున్న జవానులకు పాలు, మజ్జిగ, నీరు, ఐస్ అందించి వారికి కొంత చేదోడుగా ఉండి బాల్యంలోనే తనకున్న అపార దేశభక్తిని చాటుకున్నాడు.
దీంతో ఆ బాలుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆ పిల్లాడిని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రావణ్ సింగ్‌కు స్వయంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ సింగ్ మాట్లాడుతూ' ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో మాగ్రామానికి సైనికులు వచ్చారు. ఆ సమయంలో వారికి సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నా, వారికి పాలు,నీరు,మజ్జిగ,ఐస్ అందించా. ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు' అని అన్నారు.
శ్రావణ్ సింగ్ చాక్ తరన్ వాలి గ్రామంలో నివాసం ఉంటారు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటుంది. రాష్ట్రీయ బాల పురస్కార్‌ను ఏటా కేంద్ర ప్రభుత్వం బహుకరిస్తుంది. ఆర్ట్ అండ్ కల్చర్, పర్యావరణం, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, తదితర అంశాలతో పాటు సామాజిక సేవ తదితర అంశాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.


