తల్లిని, తోబుట్టువులను రక్షించిన బుడతడు
మెల్‌బోర్న్: ఓ తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు కలిసి కయాక్, పెడల్ బోర్డులతో సముద్రంలో సరదాగా ఈదుతున్నారు. అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న సముద్రంలో అలజడి మొదలయ్యింది. ఒక్కసారిగా అలల తాకిడి పెరిగిపోయింది. ప్రమాదాన్ని శంకించి తిరిగి ఒడ్డుకు చేరుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నలుగురూ అలా సముద్రంలోకి దూరంగా కొట్టుకుపోయారు. అప్పుడు ఆ తల్లి తీసుకున్న ఓ నిర్ణయం నలుగురి ప్రాణాలను కాపాడింది. అదేమంటే..ఇద్దరు చిన్న పిల్లలను తనతోటే ఉంచుకుని పెద్ద కుమారుడిని మాత్రం ఒంటరిగానే తీరానికి ఈదుతూ వెళ్లి, అధికారులను అప్రమత్తం చేయాలని పురమాయించింది.
ఆ బుడతడు గట్టోడు. తల్లి మాట ప్రకారం ఒంటరిగా తిరుగు పయనమయ్యాడు. వేగంగా ఈత కొట్టేందుకు అడ్డుగా ఉన్నాయంటూ తెచ్చుకున్న కయాక్‌ను, లైఫ్ జాకెట్‌ను పక్కకు పడేశాడు. మొండిగా ఈదడం మొదలుపెట్టాడు. భారీగా వచ్చి పడుతున్న అలలు తిరిగి వెనక్కి తోసేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. మెల్లమెల్లగా ముందుకు సాగాడు. అలా నాలుగు గంటలు గడిచిపోయాయి. చివరికి కాలికి నేల తగిలింది. తీరానికి చేరుకున్నాడు. అప్పటికి సమయం సాయంత్రం 6 గంటలు. వెంటనే అక్కడున్న భద్రతాధికారులకు విషయం తెలిపాడు.

తల్లి, ఇద్దరు తోబుట్టువులతో ఆస్టిన్(కుడి చివర)
వారు బోట్లు, హెలికాప్టర్లతో సముద్రంపై అన్వేషణ ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తల్లి, ఇద్దరు చిన్నారులు తీరానికి 14 కిలోమీటర్ల దూరంలో అలల మధ్యలో పెడల్ బోర్డులకు అతుక్కుని ఉండటం వారి కళ్లబడింది. వెంటనే తాళ్ల సాయంతో వారిని పైకి తీసుకుని, ఒడ్డుకు చేర్చారు. ఆ్రస్టేలియా తీరంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆ 13 ఏళ్ల బుడతడు ఆస్టిన్ అప్పెల్‌బీ కాగా, అతడు కాపాడింది తల్లి జోన్(47), తమ్ముడు బ్యూ(12), చెల్లెలు గ్రేస్(8)లను. వీరిది పెర్త్ నగరం. దాదాపు 10 గంటలపాటు సముద్రం నీళ్లలోనే ఉండిపోవడంతో ఆందోళన చెందినప్పటికీ, మొత్తమ్మీద వారికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమే రాలేదని అధికారులు తెలిపారు. తాము అక్కడికి చేరుకునేటప్పటికి ముగ్గురూ చలి తీవ్రతకు వణుకుతున్నారని, బ్యూ కాళ్లు మొద్దుబారి పోయాయని అన్నారు.
అది కఠిన నిర్ణయం
ముగ్గురు పిల్లలతోపాటు సముద్రంలోకి దూరంగా కొట్టుకుపోయినట్లు తెలుసుకున్న తాను..ఎంతో భయపడినట్లు జోన్ తెలిపారు. ‘ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం ఎంతో కఠినమైంది. అప్పటికే మెల్లమెల్లగా సూర్యాస్తమయం అవుతోంది. ఒడ్డుకు చేరి, అక్కడి వారికి మేం ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలపాలని ఆస్టిన్‌కు పురమాయించాను. ముగ్గురు పిల్లల్నీ కోల్పోలేను కదా..! ఆస్టిన్ ముందుకు వెళతాడని నమ్మకం ఉన్నా, అసలే చీకటి. సురక్షితంగా ఉంటాడో లేదో..అని లోలోపల అనుమానం’అని ఆమె వివరించారు.
పిల్లలికి ధైర్యం చెబుతూ, పాటలు పాడుతూ సరదాగా గడిపేందుకు ప్రయత్నించా. రాత్రయిన కొద్దీ అలల తీవ్రత, చలి పెరిగిపోయాయి. ఎంతసేపటికీ సాయం అందకపోయేసరికి అపాయం శంకించాను’అని జోన్ తెలిపారు.. ఎలాగైతేనేం.. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురూ సురక్షితంగా ఉన్నారు. ఇంతకన్నా కావల్సిందేముంటుంది?అని జోన్ గద్గదస్వరంతో తెలిపారు. ‘13 ఏళ్ల ఆస్టిన్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. పట్టుదల, ధైర్యంతో తల్లి, తోబుట్టువుల ప్రాణాలను కాపాడుకున్నాడు’అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ జేమ్స్ బ్రాడ్లీ అన్నారు.


