ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.
తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు.
ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి.
ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన.
प्रधानसेवक मोदी जी के प्रति केरला के बच्चों का प्रेम pic.twitter.com/u0tKKimQsw
— Dr Neetu Dabas 🇮🇳 (@INeetuDabas) January 23, 2026


