రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డాక్టర్. కె తంగరాజ్ విజ్ఞాన శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత సేవలు అందించినందుకు గానూ కేంద్రం ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. మానవ జన్యుశాస్త్రంతో పాటు తదితర అంశాలపై డా.తంగరాజ్ విశేష పరిశోధనలు జరిపారు.
డాక్టర్. తంగరాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్- అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ విభాగం డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయన భారత జనాభాలోని జన్యు వైవిధ్యం అనే అంశంపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. వాటితో పాటు భారత ఉపఖండానికి సంబంధించిన పూర్వీకుల మూలాలు, వలసలు గురించి శాస్త్రీయంగా సమాకూర్చారు.
అండమాన్ గిరిజన తెగలపై ఈయన చేసిన అధ్యయనాలు మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. వీటితో పాటు డాక్టర్ తంగరాజ్ దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే జన్యు వ్యాధులు గురించి పరిశోధనలు జరిపి వాటి నిర్ధారణ పద్ధతులు తదితర అంశాలపై కృషిచేశారు. దీంతో ఈయన సేవలకు మెచ్చిన కేంద్రప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ విజ్ఞాన శ్రీ పురస్కారానికి ఈయనను ఎంపిక చేసింది.
విజ్ఞాన్ శ్రీ పురస్కారం
విజ్ఞాన్ శ్రీ పురస్కారాన్ని కేంద్రప్రభుత్వం 2024లో ప్రవేశ పెట్టింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచేవారి గౌరవార్థం ఈ వార్డును అందజేస్తారు. దీనిని నాలుగు విభాగాలుగా అందజేస్తారు.
విజ్ఞాన రత్న- అత్యున్నత గౌరవం జీవిత కాల కృషికి
విజ్ఞాన్ శ్రీ- మధ్యస్థాయి శాస్త్రవేత్తలకు
విజ్ఞాన్ యువ- యువ శాస్త్రవేత్తలకు
విజ్ఞాన్ బృందం- శాస్త్రవేత్తల బృందానికి
ఇలా నాలుగు విభాగాలలో ఈ అవార్డుని అందజేస్తారు. ఈ పురస్కార ప్రధానం రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. గతంలో ఈ అవార్డును శాంతిస్వరూప్ భట్నాగర్ పేరుతో ప్రధానం చేసేవారు.


