ప్రముఖ నటుడు, నిర్మాత డా. మంచు మోహన్ బాబు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గవర్నర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సీవీ ఆనంద బోస్ చేతులమీదుగా ఈ అవార్డును తీసుకున్నారాయన. ‘‘మోహన్ బాబుగారు 50 సంవత్సరాల సినీ జీవితంలో కళామతల్లికి చేసిన సేవ, అట్టడుగు స్థాయి నుండి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదగడం, విద్య, దాతృత్వంలో సమాజంపై చెరగని ముద్ర వేశారు.
ఆయన సినీ, వ్యక్తిగత జీవితం, క్రమశిక్షణ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ప్రత్యేకమైన చరిత్రను సృష్టించినట్టుగా నిలిచింది. కళకు, కళాకారులకు హద్దులు, భాషా సరిహద్దులు ఉండవని మరోసారి నిరూపించారు’’ అని మోహన్ బాబు తనయుడు, ‘మా’ అధ్యక్షుడు, హీరో విష్ణు మంచు తెలిపారు.


