
నవీ ముంబై: 2008 ముంబైలో జరిగిన విధ్వంసకర ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై యుద్ధానికి దిగాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అమెరికా ఒత్తిడి వల్ల దాన్ని విరమించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్‌పై యుద్ధాన్ని విరమించుకున్నది మీరు కాదా? అంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ.
నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి బుదవారం(అక్టోబర్ 8) హాజరైన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఇక్కడ ఎవరి పేరు ప్రస్తావన తేకుండానే కాంగ్రెస్ తీరును తూర్పారబట్టారు. ‘ 2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు భీకర దాడికి దిగితే కాంగ్రెస్ ఏం చేసింది?. వారి బలహీనతను నిరూపించుకుంది. టెర్రరిజం ముందు మోకరిల్లింది’ ఇదే విషయాన్ని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడే చెప్పారు’ అంటూ విమర్శలు గుప్పించారు,
‘26/11 అనేది దేశంపై జరిగిన అత్యంత జుగుప్సాకరమైన ఉగ్రదాడి. ఈ దాడి ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా ఆ దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ విషయాన్ని చెప్పారు. మన దేశానికి మరొక దేశం యుద్ధం వద్దని హితబోధ చేయడంతో పాక్‌తో యుద్ధానికి బలగాల్ని పంపలేదంట. ఇది కదా వేరే దేశ ఒత్తిడికి లొంగడమంటే?’ అని మోదీ ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది జూలై నెలలో చిదంబరం మాట్లాడుతూ.. 2008లో అంతటి ఉగ్రదాడి జరిగిన దానికి కారణమైన పాకిస్తాన్‌తో యుద్ధాన్ని ఎందుకు వద్దనుకున్నారో చెప్పారు. తాను హోంమంత్రిగా ఉన్న ఆ సమయంలో అమెరికా ఒత్తిడి కారణంగానే దేశంలో అంతటి విధ్వంసాన్ని ఉగ్రవాదులు సృష్టించినా పాక్‌పై యుద్ధాన్ని వద్దనుకున్నామన్నారు ఓ కాంగ్రెస్ నేత.
ఇది ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. చిదంబరం చేసిన వ్యాఖ్యలను సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ ఎండగడుతూనే ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించదనేది చిదంబరం వ్యాఖ్యలతో నిరూపితమైందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. మూడు నెలల క్రితం చిదంబరం వ్యాఖ్యలను లేవనెత్తుతూ కాంగ్రెస్ వైఖరిపై ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే..