
అమృత్‌సర్: ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వర్ణ దేవాలయం(Golden Temple) ప్రాంగణంలో ఎటువంటి వైమానిక రక్షణ తుపాకులు, ఇతర వైమానిక రక్షణ వనరులను మోహరించలేదని సైన్యం స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న డ్రోన్, క్షిపణి ముప్పును ఎదుర్కొనేందుకు స్వర్ణ దేవాలయం నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో వైమానిక రక్షణ తుపాకులను మోహరించేందుకు అనుమతిచ్చారనే వార్తల నేపథ్యంలో సైన్యం ఈ ప్రకటన చేసింది.
స్వర్ణ దేవాలయంలో ఏడీ (వాయు రక్షణ) తుపాకుల మోహరింపునకు సంబంధించి పలు రకాలుగా వార్తలు వస్తున్నాయని, ఇది నిజం కాదని, ఆలయ ప్రాంగణంలో ఏడీ తుపాకులు, మరే ఇతర ఏడీ వనరులను మోహరించలేదని ఆర్మీ(Army) ఒక ప్రకటనలో తెలిపింది. దీనికిముందు ఇలాంటి వార్తలను తోసిపుచ్చుతూ, ఆలయ అదనపు ప్రధాన పూజారి మీడియాతో మాట్లాడుతూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) భారత సైన్యానికి వైమానిక రక్షణ తుపాకులను మోహరించడానికి అనుమతి ఇవ్వలేదన్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దరిమిలా బ్లాక్‌అవుట్ సమయంలో లైట్లు ఆపివేయడంపై మాత్రమే అధికారులు తమను సంప్రదించారని ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి తెలిపారు. హర్మందర్ సాహిబ్‌లో వాయు రక్షణ తుపాకుల మోహరింపునకు సంబంధించి ఏ ఆర్మీ అధికారి నుండి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని ధామి పేర్కొన్నారు. ఇదేవిధంగా హర్మందర్ సాహిబ్ అధికారి గ్రంథి గియాని రఘ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, ఆలయంలో తుపాకీల మోహరింపునకు సంబంధించి తనతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Covid-19 Returns: 257 కేసులు.. ఇద్దరు మృతి