వ్యూహాత్మక వృద్ధి దిశగా అడుగులు | budget-2026-reforms-fdi-technology | Sakshi
Sakshi News home page

Budget 2026: వ్యూహాత్మక వృద్ధి దిశగా భారత్ అడుగులు

Jan 26 2026 11:20 AM | Updated on Jan 26 2026 12:54 PM

budget-2026-reforms-fdi-technology

ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు.. అది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక సమగ్ర విధాన పత్రం. 2026 బడ్జెట్‌పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025లో చేపట్టిన కీలక కార్పొరేట్ సంస్కరణలను కొనసాగిస్తూనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది.

సంస్కరణల కొనసాగింపు

గత ఏడాది ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (వ్యాపార నిర్వహణ సౌలభ్యం)లో భాగంగా అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తూ కార్పొరేట్ విధానాలను సరళీకరించేందుకు ఎంసీఏ వీ3 ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డైరెక్టర్ల కేవైసీ ప్రక్రియను సులభతరం చేసింది. చిన్న కంపెనీలకు ఊతం ఇచ్చేలా వాటి విలీనాలు, ఇతర అనుబంధ సంస్థల విడదీత కోసం ఫాస్ట్‌ట్రాక్ విధానాన్ని విస్తరించింది. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ వివాదాల మధ్య కూడా భారత్ స్థిరమైన విదేశీ పెట్టుబడులను (FDI) ఆకర్షించగలిగింది. ఈ ఊపును 2026లోనూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రక్షణ రంగంలో సడలింపులు?

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో రక్షణ రంగ విదేశీ పెట్టుబడుల పరిమితిని సవరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐదో తరం యుద్ధ విమానాల తయారీ, కీలక విడిభాగాల ఉత్పత్తి కోసం పెట్టుబడులను పెంచడం ద్వారా గ్లోబల్ కంపెనీలను భారత్‌కు రప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పౌర, రక్షణ డ్రోన్ల తయారీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేసే ప్రకటనలు వెలువడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

సెమీకండక్టర్ మిషన్‌

భవిష్యత్తు అవసరాలైన సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ రంగాలకు ఈ బడ్జెట్ పెద్దపీట వేయనుంది. రీసైక్లింగ్ ద్వారా ఖనిజాలను పొందడంపై దృష్టి సారించేలా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశీయ ఎకోసిస్టమ్‌ను నిర్మించే స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహకాల అందించేందుకు సెమీకండక్టర్ మిషన్‌ తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సమగ్ర కృత్రిమ మేధ (AI) ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటును వేగవంతం చేస్తారని చెబుతున్నారు.

వాణిజ్య ఒప్పందాలు

2025-26 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సూచించినట్లుగా ఎగుమతుల వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) కీలకం కానున్నాయి. ప్రధాన దేశాలతో పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలను ముగించడం ద్వారా భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మార్గం సుగమం చేయడమే దీని లక్ష్యం.

కార్పొరేట్ చట్టాల సరళీకరణ

‘కంపెనీస్ (సవరణ) బిల్లు-2025’ ద్వారా కార్పొరేట్ నేరాల డీక్రిమినలైజేషన్ (శిక్షల తొలగింపు) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్నపాటి సాంకేతిక లోపాలకు జైలు శిక్షల వంటివి తొలగించి జరిమానాలతో సరిపెట్టడం ద్వారా వ్యాపారవేత్తల్లో భరోసా కల్పించాలని చూస్తోంది. వీటితో పాటు స్టాంప్ డ్యూటీ సంస్కరణలు, ఏపీఐ(ఫార్మా) తయారీకి ప్రోత్సాహకాలు, వైద్య పరికరాల పునర్నిర్మాణ విధానం తీసుకువచ్చేలా చర్యలు సాగుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement