కొందామా.. అమ్ముదామా? | which is better decision on gold and silver sell or buy | Sakshi
Sakshi News home page

కొందామా.. అమ్ముదామా?

Jan 26 2026 9:26 AM | Updated on Jan 26 2026 11:02 AM

which is better decision on gold and silver sell or buy

బంగారం, వెండి ధరల పరుగుతో సందేహాలు

ఏడాదిలోనే విపరీతంగా పెరగటంతో కొనుగోళ్లపై భయం

‘టార్గెట్‌’ చేరుకుంటే కొంత విక్రయించొచ్చు: నిపుణులు

వేగంగా పెరిగాయి కాబట్టి స్వల్పకాలంలో కరెక్షన్‌కూ అవకాశాలు

దీర్ఘకాలంలో మాత్రం పటిష్టమైన రాబడులొచ్చే చాన్స్‌

ప్రస్తుతానికి ఏకమొత్తంగా కాకుండా సిప్‌ నయమని సూచనలు

హెడ్జింగ్‌ కోసం తప్పనిసరిగా పోర్ట్‌ఫోలియోలో బంగారం, వెండి

బంగారం తులం లక్ష అంటే..? అమ్మో! అన్నారు!!. లక్ష దాటడమే అబ్బురం అనుకున్నారు. అలాంటిది నెలల వ్యవధిలో ఏకంగా రూ.1.65 లక్షలు దాటేసింది. ఇక వెండి గురించైతే చెప్పక్కర్లేదు. ఏడాదిన్నర కిందటి వరకూ కిలో లక్ష రూపాయలలోపే. లక్ష దాటడమే గగనం అనుకున్నారంతా. కానీ ఈ ఏడాదిన్నరలోనే ఏకంగా రూ.3.4 లక్షలకు చేరిపోయింది. నిజానికి  ఊహలకు కూడా అందని పరుగులివి. సెంట్రల్‌ బ్యాంక్‌లు సైతం కొండంత నమ్మకంతో పసిడిని కొనుగోలు చేస్తుండటం... వ్యక్తిగత వినియోగ అవసరాలకుతోడు రిటైల్‌ ఇన్వెస్టర్లు, సంపన్నులు సైతం బంగారంవైపు చూస్తుండటం పసిడిని పరుగులు పెట్టిస్తున్నాయి.

ఇక పారిశ్రామిక (సోలార్, ఈవీ తదితర) డిమాండ్‌ పెద్ద ఎత్తున పెరగ్గా.. సరఫరా ఆ స్థాయిలో లేకపోవడం, పెట్టుబడులకు సైతం ఇన్వెస్టర్లు మక్కువ చూపిస్తుండడంతో వెండి ధరలు ఆకాశమే హద్దుగా రివ్వుమంటున్నాయి. ఈ విలువైన లోహాల ధరలు గడిచిన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను నమోదు చేస్తుండడంతో రాబడుల కాంక్షతో కొందరు దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నారు. మరిప్పుడు ఏం చేయాలి? కొత్తగా కొనాలనుకున్న వారి పరిస్థితేంటి? ఇళ్లలో కిలోలకు కిలోలు వెండి ఉన్నవారు మంచి రేటు వచ్చింది కనక దాన్ని విక్రయిస్తే మంచిదా? ఒకవేళ బంగారం, వెండి వంటి మెటల్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే ఎలా? ఈటీఎఫ్‌లవైపు చూడొచ్చా? అందరికీ ఇవే సందేహాలు. వాటికి సమాధానమే ఈ వెల్త్‌ స్టోరీ...

ఉరుకులు పరుగులు ఎందుకంటే...

  • 2025 జనవరి నుంచి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 79 శాతం పెరిగింది. ఔన్స్‌కు 2,780 డాలర్ల నుంచి 4,965 డాలర్లకు చేరగా, వెండి ఔన్స్‌ 30 డాలర్ల నుంచి 100 డాలర్ల స్థాయిని తాకింది. ఈ కాలంలో వెండి ఏకంగా 223 శాతం ర్యాలీ చేసింది.  

  • అంతర్జాతీయంగా వృద్ధి అంచనాలు మసకబారినప్పుడు లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎగసినప్పుడు (పలు దేశాల మధ్య ఘర్షణలు/ యుద్ధాలు తలెత్తడం).. ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణితో తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని బంగారం, వెండిలోకి మళ్లిస్తుంటారు. అలాంటి ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడుల విలువ కాపాడుకునే హెడ్జింగ్‌ సాధనంగా బంగారానికి గుర్తింపు ఉంది.  

  • డాలర్‌ బలహీనత సైతం బంగారం, వెండి ధరలకు ఆజ్యం పోసేదే. డాలర్‌ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీల వారికి బంగారం, వెండి చౌకగా మారతాయి. కనుక అదనపు డిమాండ్‌ ఏర్పడుతుంది.

  • యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను మరింత తగ్గించొచ్చన్న అంచనాలు కూడా ఒక కారణమే. వడ్డీ రేట్లు దిగొచ్చే క్రమంలో ఈల్డ్స్‌ తగ్గి బాండ్లు ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో అదనపు రాబడి వస్తుందనే కారణంతో పసిడి, వెండిలోకి పెట్టుబడులు పరుగెడుతుంటాయి.  

  • ఆర్‌బీఐ నుంచి అంతర్జాతీయంగా ఎన్నో దేశాల కేంద్ర బ్యాంక్‌లు తమ విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా కొన్ని సెంట్రల్‌ బ్యాంక్‌లు బంగారం నిల్వలు అదే పనిగా పెంచుకుంటూ వెళుతున్నాయి.  

  • గోల్డ్, సిల్వర్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు)లోకి వచ్చే పెట్టుబడులు కూడా పెరగడం ధరలను మరింత ఎగిసేలా చేస్తోంది.  

  • వెండికి ప్రధానంగా పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. ఎల్రక్టానిక్స్, సోలార్‌ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుండడంతో వీటి తయారీకి అదే స్థాయిలో వెండి అవసరం ఏర్పడుతోంది. ఈ స్థాయిలో సరఫరా పెరగకపోవడం ధరలను నడిపిస్తోంది.  

  • మన రూపాయి ఇటీవలి కాలంలో డాలర్‌తో విలువను కోల్పోతూ వస్తోంది. బంగారం, వెండిని డాలర్‌ రూపంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా దేశీయంగా వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ కంటే పెరిగేలా చేస్తోంది.  

  • ఒకవైపు ఈక్విటీలు ఏడాదిన్నరగా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాయి. మరోవైపు బంగారం, వెండి గణనీయంగా ర్యాలీ చేస్తుండడంతో.. ఇన్వెస్టర్లు వాటివైపు ఆకర్షితం అవుతుండడం ధరలను మరింత పెరిగేలా చేస్తోంది.  

రిటైల్‌ ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

  • బంగారం, వెండి ధరల పరుగును చూసి హడావిడిగా పెట్టుబడులు పెట్టేయాల్సిన పనిలేదు. ఉన్నట్టుండి వీటి ధరలు గణనీయంగా పెరగడమే కాదు.. వీటిల్లో దిద్దుబాటూ అదే విధంగా ఉండొచ్చు. స్వల్పకాలంలో వీటి డిమాండ్, ధరల తీరును కచ్చితంగా అంచనా వేయలేం. దీర్ఘకాలంలో మాత్రం బంగారం, వెండి మూలాలు పటిష్టమే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాబట్టి ధరలను చూసి ఉద్రేకపడాల్సిన పనే లేదు.  

  • ఇప్పటికే భౌతిక బంగారం కొనుగోలు చేసిన వారు గరిష్ట ధరల వద్ద విక్రయించి లాభం స్వీకరించాలనుకుంటే లేదా లిక్విడిటీ (నగదు లభ్యత) పెంచుకోవాలంటే లేదా తాము అనుకున్న లక్ష్యానికి చేరువ అయితే ముందుకెళ్లొచ్చు.  

  • భౌతిక రూపంలో విక్రయించే వారు జీఎస్‌టీ చార్జీలు, తరుగు రూపంలో లాభంలో కొంత నష్టపోవాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.  

  • అనుకున్న లక్ష్యానికి బంగారం ధరలు చేరినట్టయితే పాక్షికంగా విక్రయించడం మంచి ఆలోచనే.  

  • ధరల పరుగు చూసి, మరింత పెరిగితే కొనలేమోమోనన్న భయం అవసరం లేదు. అధిక ధరల వద్ద కొనుగోలు చేసినప్పుడు స్వల్పకాలంలో కరెక్షన్ల రిస్క్‌ కూడా ఉంటుంది.  

  • బంగారం హెడ్జింగ్‌గానూ పనిచేస్తుంది కనుక కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచుకుంటే మంచి రాబడిని ఆశించొచ్చు. కాకపోతే దాని భధ్రత కోసం చేయాల్సిన వ్యయాలు, జీఎస్‌టీ ఇతరత్రా చార్జీల ప్రకారం చూస్తే.. డిజిటల్‌ సాధనాలు అనుకూలం.  

  • వెండి భౌతిక రూపంలో కొనుగోలు చేస్తే, తర్వాత నగదుగా మార్చుకోవడం కష్టం కావొచ్చు.  

  • డిజిటల్‌ రూపంలో అయితే బంగారం, సిల్వర్‌ ఈటీఎఫ్‌లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్, డిజిటల్‌ గోల్డ్‌ అందుబాటులో ఉన్నాయి.  

ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?

‘సిప్‌’ రూపంలోనే బెటర్‌...

  • గరిష్ట ధరల వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టడం కాకుండా నెలవారీ నిర్ణీత మొత్తాన్ని గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం అన్నింటిలోకి మెరుగైన మార్గమన్నది విశ్లేషకుల సూచన.  

  • ఇక్కడి నుంచి ధరలు ఇంకా ముందుకే వెళ్లినా, లేక పతనాన్ని చూసినా పెట్టుబడి కొనసాగుతుంది. కొనుగోలు ధర సగటుగా మారుతుంది.  

  • పెట్టుబడుల్లో వైవిధ్యానికి.. పోర్ట్‌ఫోలియో హెడ్జింగ్‌ కోసం చూసే వారు దీర్ఘకాలం కోసం బంగారంలో సిప్‌ రూపంలోఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.  

ఎంత పెట్టుబడి..?

ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారం, వెండికి కేటాయింపులు 10–20 శాతానికి పరిమితం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఇలా చేయడం వల్ల ఒక విభాగంలో అధిక ఎక్స్‌పోజర్‌ను నివారించొచ్చు. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలతోపాటు, పెట్టుబడులకు రక్షణనిచ్చే డెట్‌ సాధనాలు, బంగారం–వెండి మధ్య తగినంత సమతుల్యం ఉండేలా చూసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement