
ఆపరేషన్ సిందూర్ అనేది ఒక సైనిక చర్య కాదని.. అది మన దేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పశక్తికి ప్రతీక అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాగని ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని.. కేవలం తాత్కాలికంగా నిలిపివేశామని స్పష్టత ఇచ్చారు. ఆఫ్రికా దేశం మొరాకో పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.
‘‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశాం. ఆపరేషన్ సిందూర్ పార్ట్-2, 3 ఉంటుందా? అనేది పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశం ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. తగిన విధంగా బదులిస్తాం. ఇందుకోసం భారత సైన్యం సన్నద్ధంగా ఉంది. ప్రభుత్వం ఆదేశిస్తే తక్షణమే రంగంలోకి దిగుతుంది’’ రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో..
పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనా ఆయన స్పందించారు. పీవోకేపై దాడి అవసరం లేదని.. అది స్వయంగా భారత్‌లో కలిసిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
2025 ఏప్రిల్ 22న.. జమ్ము కశ్మీర్ బైసరన్ లోయ వద్ద సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) ప్రకటించుకుంది(తర్వాత తాము కాదంటూ ఫ్లేట్ ఫిరాయించింది కూడా). ఈలోపు..
మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పేరిట మెరుపు దాడులతో భారత సైన్యం పాక్‌లోకి దూసుకెళ్లి.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే.. పాక్ బతిమాలి కాల్పుల విరమణకు అంగీకరించడంతో భారత్ ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.
జూలై 28వ తేదీన శ్రీనగర్ దాచిగాం ప్రాంతంలో భారత సైన్యం, జమ్ము పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గాం సూత్రధారులు సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ(పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారి), టీఆర్‌ఎఫ్ సభ్యులు హమ్జా అఫ్గానీ, జిబ్రాన్ మరణించారు.