4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ
2030 నాటికి మూడో స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 4.18 ట్రిలియన్ డాలర్లతో జపాన్ ను వెనక్కి నెట్టినట్టు కేంద్రం ప్రకటించింది. 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్లతో జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుందని పేర్కొంది. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, చైనా, జర్మనీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2025–26 క్యూ2 జీడీపీ వృద్ధి ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరడం.. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ భారత్ బలాన్ని చాటుతున్నట్టు పేర్కొంది.
ప్రైవేటు వినియోగం వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలను ప్రకటించడాన్ని గుర్తు చేసింది. ప్రపంచ బ్యాంక్ భారత్ జీడీపీ 2026లో 6.5% వృద్ధిని నమోదు చేస్తుందనగా.. 2026లో 6.4%, 2027లో 6.5% వృద్ధి నమోదు కావొచ్చన్న మూడిస్ అంచనాలను ప్రస్తావించింది. అలాగే, ఎస్‌అండ్‌పీ (6.5 %), ఏడీబీ (7.2 %) ఐఎంఎఫ్ (6.5 %), ఓఈసీడీ (6.7 %), ఫిచ్ (7.4%) అంచనాలను గుర్తు చేసింది.


