చాలామంది సంపన్నులు భారతదేశం నుంచి విదేశాలకు తరలి వెళ్లిపోతున్నారు. దీనికి కారణం ఏమిటనే విషయాన్ని.. ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ (Sanjeev Sanyal) వెల్లడించారు.
సంజీవ్ సన్యాల్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ధనవంతులు కాలుష్యం, విలాసం లేదా ఉన్నత జీవన ప్రమాణాల కోసం మాత్రమే మనదేశాన్ని విడిచిపెట్టడం లేదని అన్నారు. అయితే దేశం వీడి వెళ్లడానికి కారణం.. ''వ్యాపార వర్గాలలో మార్పు, పోటీ లేకపోవడం" అని అన్నారు. నూతన ఆవిష్కరణలు లేనప్పుడు.. కొత్త ఆలోచనలు అమలులోకి రావు. దీంతో సంపన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని & పెట్టుబడులను విదేశాలకు తరలించడం సురక్షితమని భావిస్తారని వివరించారు.
అనేక పెద్ద భారతీయ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు దశాబ్దాలుగా ఒకే కుటుంబాలు లేదా వ్యక్తుల ఆధిపత్యంలో ఉన్నాయి. స్థిరపడిన వ్యాపారవేత్తలు తరచుగా కొత్త వెంచర్లతో ప్రయోగాలు చేయడం కంటే.. తమ సంపదను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారని సన్యాల్ పేర్కొన్నారు. దీనివల్ల కొత్తవారికి అవకాశాలు తక్కువ. నూతన ఆవిష్కరణలు, ఆలోచనలు జాడలేకుండా పోతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం చాలామంది దుబాయ్ వంటి ప్రదేశాలలో పెట్టుబడి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో కేవలం భారతీయులు మాత్రమే కాకుండా.. ఇతర దేశీయులు కూడా ఉన్నారని సన్యాల్ అన్నారు.
సంపన్నుల వలస తగ్గాలంటే..
భారతీయ కంపెనీలు పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణలలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. చాలామంది కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం ఉదారంగా ఖర్చు చేస్తున్నప్పటికీ, ఉత్పత్తి & అధునాతన సాంకేతికతలో వాస్తవ పెట్టుబడి తక్కువగానే ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ఆవిష్కరణలపై దృష్టి పెట్టకపోతే, దేశ దీర్ఘకాలిక ఆర్థిక బలం దెబ్బతింటుందని అన్నారు. యువ వ్యవస్థాపకులు రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు.
ఇదీ చదవండి: భూగర్భంలో విలువైన సంపద.. భారత్‌లో ఎక్కడుందంటే?
భారతదేశం తన సంపదను నిలుపుకోవడానికి.. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి, నిరంతర నిర్మాణాత్మక మార్పు, నూతన ఆలోచన & వ్యాపార రంగంలో పోటీ అవసరమని సన్యాల్ అన్నారు. అప్పుడే దేశం నుంచి ధనవంతుల వలస తగ్గుతుందని అన్నారు.


