ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఒకటి. ఇక్కడ ఇనుము, బొగ్గు, మాంగనీస్ వంటి వాటితో పాటు బంగారం కూడా ముఖ్యమైన ఖనిజ వనరు. ఇతర ఖనిజాల విషయాన్ని పక్కనపెడితే.. బంగారం భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, సంప్రదాయాలలో విశిష్ట స్థానం పొందింది. వివాహాలు, పండుగలు, ఆభరణాలు, పెట్టుబడులు వంటి అనేక రంగాల్లో పసిడిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల భారతదేశంలోని బంగారు గనులు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్
భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బంగారు గనులకు కేంద్రంగా నిలిచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇండియాలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో విస్తృతంగా తవ్వకాలు జరిపారు. అయితే ప్రస్తుతం కొన్ని ఆర్ధిక సాంకేతిక కారణాల వల్ల క్లోజ్ చేశారు.
హట్టి గోల్డ్ మైన్స్
కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్.. ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్న అత్యంత ముఖ్యమైన బంగారు గని. రాయచూర్ జిల్లాలో ఉన్న ఈ గనులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. బంగారు ఉత్పత్తిలో హట్టి గనులు ప్రస్తుతం ప్రధాన వనరుగా నిలుస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఇక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి.
రామగిరి
కర్ణాటక మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరి (అనంతపురం జిల్లా) ప్రాంతం పూర్వకాలంలో బంగారు తవ్వకాలకు ప్రసిద్ధి. కడప, చిత్తూరు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు గుర్తించారు. అదే విధంగా తెలంగాణలోని రామగిరి (పెద్దపల్లి జిల్లా) ప్రాంతం కూడా చారిత్రకంగా బంగారు గనులకు ప్రసిద్ధి చెందింది.
ఇవి కాకుండా.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్‌భూమ్ జిల్లా, రాజస్థాన్‌లోని బనాస్‌వారా, ఉదయ్‌పూర్ ప్రాంతాలు, కేరళలోని వయనాడు జిల్లా మొదలైన ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో జరిగే తవ్వకాలకు పరిమితులు విధించారు. కాబట్టి ఇక్కడ విరివిగా తవ్వకాలు జరపడం నిషిద్ధం.
బంగారు గనులు - ఎదుర్కొంటున్న సవాళ్లు
బంగారు గనుల తవ్వకాలు అనుకున్నంత సులభమేమీ కాదు. ఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. లోతైన గనులు, అధిక వ్యయం, పర్యావరణ సమస్యలు, ఆధునిక సాంకేతిక అవసరాలు వంటి అంశాలు తవ్వకాలను ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త అన్వేషణలు, ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తోంది.


