దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు | Gig Workers Strike On December 31 Updates | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు

Dec 31 2025 7:50 AM | Updated on Dec 31 2025 8:39 AM

Gig Workers Strike On December 31 Updates

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: ఇయర్‌ ఎండ్‌నాడు.. కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్‌ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశరాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ ఉదయం నుంచి డెలివరీ సేవలు నిలిచిపోయాయి.  

జోమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.ఈ సమ్మెకు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్, ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ–ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల గిగ్‌ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. 

కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో.. ఇవాళ భారీ ఆర్డర్‌లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంగా ఫుడ్‌, గ్రాసెసరీలపై అవి ఎక్కువగా ఉండే ఛాన్స్‌ఉంది. అయితే సమ్మె నేపథ్యంలో ఆ సేవలకు విఘాతం కలగనుంది. పుణె, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాతోపాటు టయర్‌–2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్‌ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావ పడుతుందని అంటున్నారు.  హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌ ఈ సమ్మె కారణంగా ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా కొందరు నెటిజన్లు సైతం gig workersకు మద్దతుగా నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకూ తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ‘ఈ ఉద్యోగంతో జాబ్‌ గ్యారెంటీ లేదు, భద్రతతోపాటు గౌరవం కూడా లేదు’అని గిగ్‌వర్కర్లు వాపోతున్నారు. బ్రేక్ లేకుండా పనిచేస్తున్న తమకు న్యాయమైన జీతంతో పాటు కమీషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు.. 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్‌ను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే.. రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.

నిజానికి ఈ డిమాండ్లతో.. క్రిస్మస్ రోజునే దాదాపు 40వేల మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా.. దాదాపు 50 శాతం డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా లక్షా 50వేల మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదను చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మెబాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతోంది.

ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానుంది. అలాగే.. సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్‌–మైల్‌ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

సమ్మెతో లాస్‌ ఎవరికి?.. 
గిగ్‌ వర్కర్ల సమ్మె.. అంటే డెలివరీ బాయ్స్‌ ఆగిపోవడంతో కస్టమర్లకు ఫుడ్, గ్రోసరీ సేవలు నిలిచిపోతాయి. ఈ–కామర్స్ ఆర్డర్లు ఆలస్యం అవుతాయి. లేదంటే రద్దు కూడా కావొచ్చు. తద్వారా లక్షల మందికి ఇయర్‌ ఎండ్‌ ప్రణాళికలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. సమ్మె ద్వారా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైనవాటికి భారీగా ఆర్డర్లు నిలిచిపోవడం వల్ల ఆదాయం తగ్గిపోతోంది. 

రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలు దెబ్బ తినే అవకాశం ఉంది. రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. చిన్న వ్యాపారాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. గిగ్ వర్కర్లు (డెలివరీ ఏజెంట్లు) తాత్కాలికంగా ఆదాయం ఆగిపోతుంది. అయితే.. దీర్ఘకాలంలో తమ డిమాండ్లు నెరవేరితే ఉద్యోగ భద్రత, జీతం, బీమా లాంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉండడంతో.. ఇవాళ వచ్చే అదనపు కమిషన్ల కన్నా సమ్మెకే వాళ్లు మొగ్గు చూపిస్తుండడం గమనార్హం. 

వినియోగదారుల అసంతృప్తి, కంపెనీల ఒత్తిడి, కార్మిక సంఘాల డిమాండ్లతో.. వెరసి ఈ సమ్మెలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాగైనా.. గిగ్ వర్కర్లను కార్మిక చట్టాల్లో చేర్చే పాలసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement