
ఢిల్లీ: ఇజ్రాయెల్, గాజా శాంతి(Gaza Peace) ఒప్పందం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈజిప్టు వేదికగా సోమవారం జరగబోయే గాజా శాంతి ఒప్పందానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని (PM Narendra Modi)ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald Trump) ఆహ్వానించారు. ఈ మేరకు జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
వివరాల ప్రకారం.. ఈజిప్ట్ (Egypt) వేదికగా రేపు ఇజ్రాయెల్(Israel), గాజా మధ్య శాంతి ఒప్పందం జరుగబోతుంది. ఈ శాంతి ఒప్పందంలో ప్రధాని మోదీ హాజరు కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీకి ఆహ్వానం పంపించారు. మరోవైపు.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి (Abdel Fattah al-Sisi) సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మోదీ హాజరుపై ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇరు పక్షాల అంగీకారం..
ఇదిలా ఉండగా.. ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోతున్న కల్లోలిత గాజాలో శాంతి సాధనకు అడుగులుపడిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరిపక్షాలైన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేయబోతున్నాయి. రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం పూర్తిగా ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఒప్పందం ప్రకారం.. గాజాలో దాడులు వెంటనే ఆపేయాలి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను అతిత్వరలో హమాస్ మిలిటెంట్లు విడుదల చేయనున్నారు. అందుకు బదులుగా తమ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విముక్తి కల్పించనుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోనుంది.
రెండు కీలకమైన అంశాలపై రాని స్పష్టత..
హమాస్ అధీనంలో 20 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు అంచనా. భగవంతుడి దయతో వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హమాస్ సైతం స్పందించింది. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలని, గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించాలని పేర్కొంది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను తమకు అప్పగించాలని తేల్చిచెప్పింది. మరోవైపు రెండు కీలకమైన అంశాలపై స్పష్టత రాలేదు. ట్రంప్ ప్లాన్ ప్రకారం హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. గాజా పరిపాలన బాధ్యతలను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా అథారిటీకి అప్పగించాలి. ఈ రెండింటిపై హమాస్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: మీరు భయపెడితే బెదిరిపోవాలా?.. ట్రంప్‌కు చైనా కౌంటర్