
భారత్ ఎంత ఖండిస్తున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారడం లేదు. భారత్-పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన.
అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం వైట్‌హౌస్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్‌లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజు జరిగిన పరిణామాలంటూ స్పందించారు.
‘‘ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి.. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాక్‌తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుఉందని భావించా. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్‌తో వాణిజ్యఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్‌లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటిరోజు దాకా సమయం ఇస్తే.. ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.
US President #DonaldTrump once again doubles down on his claim of playing a catalyst in the truce between India and Pakistan.
I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said, What's going on with you and Pakistan?, says Trump.
For the latest… pic.twitter.com/8eQ86ZU0ql— NDTV Profit (@NDTVProfitIndia) August 27, 2025
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ గత కొంతకాలంగా ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఈ ప్రకటనలో విపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య మిలిటరీ స్థాయి చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. అలాగే.. మోదీ–ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇక..
ఆ మధ్య జీ7 సదస్సు నిమిత్తం కెనడా వెళ్లిన ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ.. భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ‘‘పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్యఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశం పైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్-పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోం’’ అని నాడు అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టం చేశారు. అయినా కూడా ట్రంప్, అమెరికా అదే పాట పాడుతూ వస్తోంది.
ఇదీ చదవండి: ట్రంప్ ఫోన్ కాల్స్‌కు మోదీ నో