ట్రంప్‌ ఫోన్‌ కాల్స్‌కు మోదీ నో | Narendra Modi ignoring Donald Trump calls after tariffs crisis | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఫోన్‌ కాల్స్‌కు మోదీ నో

Aug 27 2025 5:12 AM | Updated on Aug 27 2025 5:12 AM

Narendra Modi ignoring Donald Trump calls after tariffs crisis

ట్రంప్‌ నాలుగుసార్లు ఫోన్‌ చేసినా పలకని ప్రధాని మోదీ

జర్మనీ వార్తాపత్రిక ‘ఫ్రాంక్‌ఫర్టర్‌ అల్‌జెమేని’ కథనం  

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారా? అందుకు మోదీ తిరస్కరించారా? ట్రంప్‌తో సంభాషణకు మోదీ ఇష్టపడలేదా? అంటే.. అవుననే చెబుతోంది జర్మనీ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్‌ అల్‌జెమేని(ఎఫ్‌ఏజెడ్‌). భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దీనిపట్ల భారత నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 

ఈ నేపథ్యంలో మోదీతో ఫోన్‌లో మాట్లాడడానికి ట్రంప్‌ కనీసం నాలుగుసార్లు ప్రయత్నించారని జర్మనీ పత్రిక పేర్కొంది. అమెరికా నుంచి నాలుగుసార్లు ఫోన్‌ చేసినా మోదీ స్పందించలేదని వెల్లడించింది. అమెరికా విజ్ఞప్తులను ఆయన గట్టిగా తిరస్కరించారని, ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల పట్ల తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తీకరించారని స్పష్టంచేసింది. ఈ మేరకు జర్మనీ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బెర్లిన్‌కు చెందిన గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ థార్‌స్టెన్‌ బెన్నర్‌ తాజాగా ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.   

ట్రంప్‌ శాపనార్థాలు  
భారత్‌–అమెరికా మధ్య గత 25 ఏళ్లుగా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కానీ, ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్‌ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. భారత్‌ ఇస్తున్న సొమ్మును ఉక్రెయిన్‌లో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ట్రంప్‌ హెచ్చరికలను భారత ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్‌లు విధించారు. భారత్‌–రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాయంగా మారుతాయంటూ ట్రంప్‌ శాపనార్థాలు సైతం పెట్టారు. అయితే, ట్రంప్‌కు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని తేలి్చచెప్పారు. టారిఫ్‌లకు బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.  

రెచ్చగొట్టేలా ట్రంప్‌ చర్యలు!  
మరోవైపు భారత్‌–పాకిస్తాన్‌ ఘర్షణను తానే ఆపేశానని ట్రంప్‌ తరచుగా చెప్పుకుంటున్నారు. తాను చొరవ తీసుకోకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. భారత్‌పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్‌పై దాడులకు తెరదించేలా చేశానని ట్రంప్‌ తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ హఠాత్తుగా ఆగిపోవడం తన ఘనతేనని స్పష్టంచేశారు. అయితే, ట్రంప్‌ వ్యాఖ్యలను భారత్‌ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారత్‌–పాక్‌ యుద్ధాన్ని ఆపేసినందుకు నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడినని అంటున్నారు. 

ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌ సైన్యాధిపతి అసిమ్‌ మునీర్‌ను ట్రంప్‌ ముద్దు చేస్తున్నారు. వైట్‌హౌస్‌కు అధికారికంగా ఆహా్వనించి, ఘనంగా విందు ఇచ్చారు. పాకిస్తాన్‌కు ఆర్థికంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భారత ప్రభుత్వానికి రుచించడం లేదు. ట్రంప్‌ చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావిస్తోంది. అందుకు ట్రంప్‌తో మాటాడ్డానికి ప్రధాని మోదీ ఇష్టపడలేదని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో చైనాతో సంబంధాలకు మోదీ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఆయన ఈ నెలాఖరులో చైనాలో పర్యటించబోతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement