
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తోంది
ఈ ప్రయాణంలో మేమూ భాగస్వాములం అవుతాం
యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ వెల్లడి
భారత ప్రధాని మోదీతో సమావేశం
ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చ
యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదుల కార్యకలాపాలు అరికట్టాలని స్టార్మర్‌కు విజ్ఞప్తి
ముంబై: భారత్ ఆర్థికంగా సూపర్ పవర్‌గా ఎదుగుతోందని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో వేగంగా దూసుకెళ్తోందని అన్నారు. ఈ ప్రయాణంలో తాము సైతం భాగస్వాములం అవుతామని చెప్పారు.
అద్భుత నాయకత్వ ప్రతిభతో భారత్‌ను ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. స్టార్మర్ గురువారం ముంబైలో మోదీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వేర్వేరు రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–యూకే మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు సైతం జరిగాయి. మోదీతో భేటీ అనంతరం స్టార్మర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై మోదీతో చర్చించానని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామని వెల్లడించారు. భారత్, యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు.
భాగస్వామ్యమే మూలస్తంభం: మోదీ
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత అనిశి్చత పరిస్థితుల్లో ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక ప్రగతికి భారత్–యూకే భాగస్వామ్యం ఒక మూలస్తంభంగా నిలుస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్, యూకేలు సహజ మిత్రదేశాలు, భాగస్వామ్య పక్షాలని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, చట్టబద్ధపాలన అనే పునాదిపై రెండు దేశాల బంధం నిర్మితమైందని అన్నారు.
నైపుణ్యం, సాంకేతికతలే చోదకశక్తిగా యూకేతో భాగస్వామ్యం నానాటికీ బలపడుతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇరుదేశాల ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ఉమ్మడిగా కృషి చేయడానికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. కీర్ స్టార్మర్‌తో సమావేశమైన తర్వాత మోదీ మీడియాతో మాట్లాడారు. అరుదైన ఖనిజాల విషయంలో సహకరించుకోవడానికి ఇండస్ట్రీ గిల్డ్, సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు.
ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో శాటిలైట్ క్యాంపస్ నెలకొల్పనున్నట్లు వివరించారు. అంతేకాకుండా వాతావరణం, సాంకేతికత, కృత్రమ మేధ(ఏఐ)లో పరిశోధనల కోసం క్లైమేట్ టెక్నాలజీ స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తీవ్రవాదానికి తావులేదని మోదీ తేల్చిచెప్పారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కీర్ స్టార్మర్‌కు విజ్ఞప్తి చేశారు.
‘తుఝే దేఖా తో’ పాట విన్న స్టార్మర్
సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం దిల్వాలే దుల్హానియా లే జాయెంగేలోని ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ పాటను బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ ఎంతగానో ఆస్వాదించారు. ఆయన ఈ పాట వింటున్న వీడియోను యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ సంస్థే నిర్మించిన సంగతి తెలిసిందే. భారత పర్యటనకు వచి్చన స్టార్మర్ బుధవారం ముంబైలోని యశ్‌రాజ్ ఫిలింస్ స్టూడియోను సందర్శించారు.
రక్షణ ఒప్పందం
భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవాలని మోదీ, స్టార్మర్ నిర్ణయానికొచ్చారు. ఈ మేరకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి లైట్‌వెయిట్ మల్టిరోల్ మిస్సైల్ సిస్టమ్స్‌ను అందజేయబోతున్నట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది. అలాగే భారత నావికాదళంతో కలిసి మారిటైమ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారత వైమానికదళం, బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ శిక్షకులు పరస్పరం సహకరించుకోబోతున్నారు.
ఇండియాలో యూకే వర్సిటీ క్యాంపస్‌లు
యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లాంకాస్టర్, యూనివర్సిటీ ఆఫ్ సర్రే తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ విషయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వయంగా ప్రకటించారు. యూకేకు చెందిన పలు వర్సిటీలు ఇప్పటికే తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేశాయి. వచ్చే ఏడాది మరికొన్ని వర్సిటీలు క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నాయి.