breaking news
super power country
-
ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్
ముంబై: భారత్ ఆర్థికంగా సూపర్ పవర్‌గా ఎదుగుతోందని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో వేగంగా దూసుకెళ్తోందని అన్నారు. ఈ ప్రయాణంలో తాము సైతం భాగస్వాములం అవుతామని చెప్పారు. అద్భుత నాయకత్వ ప్రతిభతో భారత్‌ను ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. స్టార్మర్ గురువారం ముంబైలో మోదీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వేర్వేరు రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–యూకే మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు సైతం జరిగాయి. మోదీతో భేటీ అనంతరం స్టార్మర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై మోదీతో చర్చించానని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామని వెల్లడించారు. భారత్, యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. భాగస్వామ్యమే మూలస్తంభం: మోదీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత అనిశి్చత పరిస్థితుల్లో ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక ప్రగతికి భారత్–యూకే భాగస్వామ్యం ఒక మూలస్తంభంగా నిలుస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్, యూకేలు సహజ మిత్రదేశాలు, భాగస్వామ్య పక్షాలని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, చట్టబద్ధపాలన అనే పునాదిపై రెండు దేశాల బంధం నిర్మితమైందని అన్నారు. నైపుణ్యం, సాంకేతికతలే చోదకశక్తిగా యూకేతో భాగస్వామ్యం నానాటికీ బలపడుతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇరుదేశాల ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ఉమ్మడిగా కృషి చేయడానికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. కీర్ స్టార్మర్తో సమావేశమైన తర్వాత మోదీ మీడియాతో మాట్లాడారు. అరుదైన ఖనిజాల విషయంలో సహకరించుకోవడానికి ఇండస్ట్రీ గిల్డ్, సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో శాటిలైట్ క్యాంపస్ నెలకొల్పనున్నట్లు వివరించారు. అంతేకాకుండా వాతావరణం, సాంకేతికత, కృత్రమ మేధ(ఏఐ)లో పరిశోధనల కోసం క్లైమేట్ టెక్నాలజీ స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తీవ్రవాదానికి తావులేదని మోదీ తేల్చిచెప్పారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కీర్ స్టార్మర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘తుఝే దేఖా తో’ పాట విన్న స్టార్మర్ సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం దిల్వాలే దుల్హానియా లే జాయెంగేలోని ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ పాటను బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ ఎంతగానో ఆస్వాదించారు. ఆయన ఈ పాట వింటున్న వీడియోను యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ సంస్థే నిర్మించిన సంగతి తెలిసిందే. భారత పర్యటనకు వచి్చన స్టార్మర్ బుధవారం ముంబైలోని యశ్‌రాజ్ ఫిలింస్ స్టూడియోను సందర్శించారు. రక్షణ ఒప్పందం భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవాలని మోదీ, స్టార్మర్ నిర్ణయానికొచ్చారు. ఈ మేరకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి లైట్‌వెయిట్ మల్టిరోల్ మిస్సైల్ సిస్టమ్స్‌ను అందజేయబోతున్నట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది. అలాగే భారత నావికాదళంతో కలిసి మారిటైమ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారత వైమానికదళం, బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ శిక్షకులు పరస్పరం సహకరించుకోబోతున్నారు. ఇండియాలో యూకే వర్సిటీ క్యాంపస్‌లు యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లాంకాస్టర్, యూనివర్సిటీ ఆఫ్ సర్రే తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ విషయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వయంగా ప్రకటించారు. యూకేకు చెందిన పలు వర్సిటీలు ఇప్పటికే తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేశాయి. వచ్చే ఏడాది మరికొన్ని వర్సిటీలు క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నాయి. -
రష్యా, చైనాలతో భారత్‌కు పోలిక లేదు: ఫిన్లాండ్ అధ్యక్షుడు
హెల్సింకి: భారతదేశం.. రష్యా, చైనాల మాదిరి కాదని..అదొక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ అని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను పరిష్కరించడంలో భారతదేశ భౌగోళిక, రాజకీయ పాత్రను, శాంతి చర్చలలో భాగస్వామ్యాన్ని ఆయన వివరించారు. సాంకేతిక, వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్- ఫిన్లాండ్ సంబంధాలను బలోపేతం చేయడానికి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశ అభివృద్ధిని కొనియాడుతూ పాశ్చాత్య దేశాలు ఆ దేశంతో మరింత సన్నిహితంగా మెలగాలని కోరారు. బ్లూమ్‌బెర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతదేశం, రష్యా, చైనా మధ్య పెరుగుతున్న సమన్వయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం అటు యూరోపియన్ యూనియన్‌కు, ఇటు యునైటెడ్ స్టేట్స్కు సన్నిహిత మిత్రదేశం. అందుకే రష్యా, చైనా దేశాల జాబితాలో భారత్‌ను చేర్చనన్నారు. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్. అందుకే పశ్చిమ దేశాలు భారతదేశంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని అన్నారు. 🚨 BIG STATEMENT🇫🇮 Finland Prez Stubb: “India is a very close ALLY of the EU & US.”“India is an emerging SUPERPOWER with demography & economy on its side.” 🔥“West must engage with India.” 🎯 pic.twitter.com/oVwfEA3ERW— Megh Updates 🚨™ (@MeghUpdates) September 24, 2025రష్యా- చైనా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయని భావిస్తున్నానని, 1990ల ప్రారంభంలో చైనా-రష్యా ఒకే పరిమాణంలో ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు చైనా 10 రెట్లు వృద్ధి సాధించింది. ఇప్పుడు రష్యా నుంచి చమురు,గ్యాస్ కొనుగోలు, సాంకేతిక మార్పిడితో పరస్పర సహకారం అందిస్తోంది. ఇది రష్యా యుద్ధ తంత్రానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే ఆ దేశాల మధ్య దగ్గరి సంబంధం ఉన్నదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.భారతదేశంతో ఇతర దేశాల భాగస్వామ్యం కోసం ఫిన్లాండ్ పిలుపు నివ్వడం ఇది మొదటిసారి కాదని, అంతకుముందు, హెల్సింకి సెక్యూరిటీ ఫోరం 2025లో కోరామన్నారు. తాను ఇటీవల ప్రధాని మోదీతో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడానని, తొలుత కాల్పుల విరమణ అవసరమని, ఆ తర్వాతనే శాంతి చర్చలను ప్రారంభించగలమని మోదీ పేర్కొన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు హాజరైన షాంఘై సహకార సంస్థ (ఎసీసీఓ)సమ్మిట్‌కు హాజరయ్యారని, ఆ సమయంలో వారి మధ్య స్నేహాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. -
మన సైనికులకు సెల్యూట్: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్‌క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి. సూపర్‌పవర్‌గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘ గాల్వాన్, తవాంగ్లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్‌నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి. 1991లో భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్‌లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు. -
రణక్షేత్రంలో రష్యా.. ఉరిమి చూస్తున్న అమెరికా.. మరి ఇండియా ఏం చేయాలి?
సాంకేతికంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా భారత్ సూపర్ పవర్ దేశంగా మారాలని లేదంటూ పొరుగున్న ఉన్న దేశాలతో ఏనాటికైనా ముప్పే అంటూ హెచ్చరిస్తున్నాడు జోహో కంపెనీ సీఈవో శ్రీధర్ వేంబు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు ట్విటర్ వేదికగా చేశారు. ప్రస్తుతం కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. నాటో దళాలు తమ పక్కన చేరుతున్నాయంటూ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. సోవియట్ చర్యను తప్పు పడుతూ ఆర్థిక ఆంక్షలు విధించాయి అమెరికా , ఈయూ కూటమి దేశాలు. మన పొరుగు దేశాలపైన చైనా, పాకిస్తాన్‌లు రష్యాకు మద్దతుగా నిలిచాయి. ఇండియా తటస్థ వైఖరి తీసుకుంది. అయితే ఈ తటస్థ వైఖరి ఎంతో కాలం మేలు చేయదంటున్నారు శ్రీధర్వేంబు. టెక్నాలజీ, ఆర్థికం, మిలిటరీ పరంగా ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యాలు వరుసగా మూడు సూపర్ పవర్ దేశాలు ఉన్నాయన్నారు. ఏలాంటి పరిస్థితుల్లోనూ ఈ సూపర్ పవర్ దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవన్నారు. అదే జరిగితే ఊహించని నష్టం జరగుతుందన్నారు. అందుకే సూపర్ పవర్ దేశాలు పరస్పరం దాడి చేసుకోవని తెలిపారు. మూడు సూపర్ పవర్ దేశాల్లో ఒకటైన చైనా తైవాన్ ఆక్రమణకు ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తోంది. రేపటి రోజున చైనా అనున్నంత పని చేసినా ఆ దేశాన్ని ఏ శక్తి అడ్డుకోదన్నారు. చైనాకు పొరుగున్న ఉన్నందున ఎప్పటికైనా భారత్‌కు చైనా ముప్పే అన్నారు. చైనా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ధీటుగా ఎదుర్కొవాలంటే మిలిటరీ, ఫైనాన్స్, టెక్నాలజీ సెకార్లలో ఇండియా సూపర్ పవర్‌గా మారాల్సిందే అని సూచించారు. చైనాతో ముప్పు తలెత్తితే రష్యా, అమెరికాల నుంచి సాయం అందుతుందన్న నమ్మకం లేదన్నారు. సూపర్ పవర్ దేశాలు ఎప్పుడూ మరో దేశం వెనుక ఉండాలని కోరుకోవన్నారు. ఉక్రెయిన్, తైవాన్ లాంటి దుస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే భారత్ తన శక్తిని తాను నమ్ముకోవాలన్నారు. పరిస్తితులకు తగ్గట్టుగా శక్తివంతగా మారాలని దానికి కచ్చితమైన ప్రణాళిక అవసరమన్నారు. -
సూపర్ పవర్ కంట్రీగా భారత్
అద్దంకి : సూర్యుని వెలుగులు పది నుంచి పన్నెండు గంటలు నిర్విరామంగా విరజిమ్మే భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీగా నిలుస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకు చెందిన పరిశోధకుడు డాక్టర్ ఎల్ గిరిబాబు అన్నారు. స్థానిక కట్టారామకోటేశ్వరావు డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ‘రీసెంట్ టెక్నాలజీస్ ఆఫ్ కెమిస్ట్రీ’ అనే అంశంపై శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన తను ఆవిష్కరించిన ‘గ్రీన్ సోలార్ పవర్ ప్రాజెక్టు’ ఉపయోగాల గురించి వీడియో చిత్రాల ద్వారా తెలియజేశారు. ఈ సదస్సులో మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ నుంచి వచ్చిన 200 మంది తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్‌ను తయారు చేసుకునే వాటిల్లో ‘ఆర్గానిక్ సోలార్ సెల్’ పద్ధతి ఒకటన్నారు. ఈ పద్ధతిలో సిలికాన్ ప్యానల్స్‌కు బదులు తక్కువ ధరలో లభించే పదార్థాలతో నాణ్యమైన పరికరాలను తయారు చేయడం, అదీ నానో టెక్నాలజీలో తయారు చేయడం విశేషమని చెప్పారు. ఈ సోలార్ ప్యానెల్ ట్యూబ్‌లైట్ వెలుగు నుంచి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. అనంతరం కాలుష్యరహిత ఉత్ప్రేరకాల తయారీపై డాక్టర్ ఎన్ లింగయ్య, చక్కెరల కర్బన లోహశక్తి గురించి రాజీవ్ త్రివేది, పైరబోలిక్ ఉత్పన్నాల తయారీ గురించి ఐఐసీటీ హైదరాబాదుకు చెందిన డాక్టర్ రవి, గ్రీన్ సాల్వెంట్స్ గురించి ఐఐటీ చెన్నైకి చెందిన డాక్టర్ రమేష్, నానో పెస్టిసైడ్స్ గురించి గీతం యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎన్వీఎస్ వేణుగోపాల్ సవివరంగా విశదీకరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు శ్రీనివాసరెడ్డి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. పాల్గొన్న వారికి మెమొంటోలు, ప్రశంసా పత్రాలు కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్ రాజు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జీ రాజేశ్వరి, కళాశాల పీడీ ధనుంజయ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.


