జనతంత్రం
ఇరవయ్యొకటో శతాబ్దంలో పాతికేళ్ల కాలం కరిగిపోయింది. ఇంకో ఇరవయ్యొక్క సంవత్సరాలు ఓపిక పట్టండి, భారత దేశాన్ని సూపర్ పవర్ చేసి చూపిస్తామని మన అధినేతలు అర చేతుల్లోనే వైకుంఠ దర్శనాలు చేయిస్తున్నారు. వైవిధ్య భారత దేశం వలస పాలన సంకెళ్లు తెంచుకొని అప్పటికి (2047) వందేళ్లు పూర్తవుతాయి. మనదేశం శతమాన స్వతంత్ర భారత మవుతుంది. అధినేతలు ‘అదివో అల్లదివో’ అంటూ ఆకాశం వైపు చూపెడుతున్నట్టు సూపర్ పవర్‌గా భారత్ ఆవిష్కృతమైతే ఆనందపడని పౌరుడెవరుంటారు? కానీ, ఆ గమ్యం చేరేందుకు ముందుగా స్వాతంత్య్రోద్యమం నాటి ఆకాంక్షలు నెరవేరవలసి ఉంటుంది. దేశ బహుళత్వ స్వభావంలోంచి ఒక ఏకత్వ భావనను పెంపొందింపజేయడం స్వతంత్ర భారతానికి తొలి సవాల్‌గా ఎదురైంది.
అభివృద్ధి క్రమంలో హస్తిమశకాంతరాలున్న ప్రజలు, ప్రాంతాల మధ్య సమన్వయం కూర్చడం ఒక పెద్ద బాధ్యత. బ్రిటిష్ వాళ్ల ప్రత్యక్ష పరిపాలనలో కునారిల్లిన ప్రాంతాలు ఒక పక్కన, ఫ్యూడల్ దోపిడీకి నెలవైన వందలాది స్వదేశీ సంస్థానాలు మరో పక్కన! ఈ రెండింటినీ ఒకే చట్టంతో ముడివేసి ఒక దేశంగా ముందుకు నడవ్వలసిన సందర్భం అది. విభిన్న మతవిశ్వాసాలూ, భాషా సంస్కృతులూ చేతులు కలిపి గంగాయమునా సంగమ శ్రుతిలో ప్రవాహ గీతం పాడుకోవా లని బాస చేసుకున్న సన్నివేశమది. అమానవీయమైన స్థాయిలో ఏర్పడిన ఆర్థిక అంతరాలను తొలగించడానికి అందరికీ సమానా వకాశాలు లభించే విధంగా ఒడంబడిక చేసుకున్న ఓ అరుదైన ఘట్టం. కదిలే కాలంతో నాటి స్వరాజ్య భానూదయం ఒక చరిత్రాత్మకమైన ఒప్పందాన్ని చేసుకున్నది.
మహాదార్శనికుడైన పండిత జవహర్‌లాల్ నెహ్రూ మాటల్లో అదొక ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’. ప్రపంచమే ప్రణమిల్లిన గాంధీ మహాత్ముని ఆశయాలకు అధికారిక హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్న ముహూర్తం. ఈ నేపథ్యంలో రూపుదిద్దు కున్నదే భారత రాజ్యాంగం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 389 మంది రాజ్యాంగ సభ సభ్యుల మేధోశ్రమను మథించి, ప్రపంచంలోని ప్రజాస్వామ్య రాజ్యాంగాలను పరిశో ధించి, దేశ అభివృద్ధి క్రమానికి అవసరమైన రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియుల మాగ్నాకార్టాగా పరిగణన పొందిన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చాలనీ, భావ ప్రకటనతోపాటు విశ్వాస ఆరాధనా స్వేచ్ఛ అందరికీ ఉండాలనీ, అవకాశాల్లో, హోదాల్లో అందరి మధ్యన సమానత్వం పరిఢ విల్లాలనీ, వ్యక్తిగత గౌరవ మర్యాదలతో అందరి మధ్యన సౌభ్రా తృత్వం వెల్లివిరియాలనీ రాజ్యాంగం ఆకాంక్షించింది.
ఈ రాజ్యాంగ లక్ష్యాలు పూర్తిగా సఫలమైన రోజున సుశిక్షితులూ, నిపుణులైన ప్రజలు దేశ జనాభాకు తగినట్టుగా అభివృద్ధి పథంలో కూడా దేశాన్ని నంబర్‌వన్ స్థాయిలో నిలబెట్ట గలుగుతారు. నూటా నలభై కోట్ల జనాభా ఉన్న దేశానికి సూపర్ పవర్ హోదా అసాధ్యమైనదేమీ కాదు. కావలసినదల్లా ప్రజల్లో సౌభ్రాతృత్వం, విశ్వాస – ఆరాధనా స్వేచ్ఛ, సమాన స్థాయిలో లభించే అవకాశాలు. ఈ రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో మనం ఎక్కడున్నామనే విషయం తెలిస్తే సూపర్ పవర్ హోదా ఇంకెంత దూరంలో ఉన్నదో అర్థమవుతుంది. ప్రజల్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని నిరుపేదరికం తగ్గి వుండవచ్చు నేమో. కానీ, ఆర్థిక అసమానతలు నాటికంటే నేడు మరింత పెరిగాయి. అసమానతల పెరుగుదలలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని నాలుగు రోజుల క్రితం విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక స్పష్టం చేసింది. రాజ్యాంగం అభిలషించిన సౌభ్రాతృత్వ భావన అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ‘హిందూ రాష్ట్ర’ సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన ఆరెస్సెస్ ప్రభుత్వ అండదండలతో దేశ ఆయువుపట్టు వంటి పార్శ్వాల్లోకి ఎలా పాకిందో వెల్లడిస్తూ వారం రోజుల క్రితం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక పరిశోధనా కథనాన్ని బ్యానర్ స్టోరీగా ప్రచురించింది.
‘బ్రిటిష్ రాజ్’ నాటి ఆర్థిక అసమానతల కంటే నేటి ‘బిలియనీర్ రాజ్’లో భారతదేశ ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయని అసమానతలపై ప్రపంచ నివేదిక – 2026 వ్యాఖ్యా నించింది. భారతదేశంపై నివేదికలను రూపొందించడంలో థామస్ పికెట్టీ వంటి ప్రసిద్ధ ఆర్థికవేత్తలు భాగం పంచు కున్నారు. వార్షిక ఆదాయాన్ని మాత్రమే లెక్కగట్టి రూపొందించే ప్రపంచ బ్యాంకు నివేదికలకు భిన్నంగా ఆదాయం, సంపదలతో పాటు అనేక ఆర్థిక కార్యకలాపాలపై విస్తృత అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఇది. ‘బ్రిటిష్ రాజ్’తో పోల్చితే 1980వ దశకం నాటికి దేశంలో ఆర్థిక అసమానతలు బాగా తగ్గాయని ఈ నివేదిక వెల్లడించింది. సంఘ్ పరివార్ నిత్యం ఆడిపోసుకునే నెహ్రూ విధానాలు అమలైన కాలం కూడా ఇదే కావడం గమనించతగ్గది.
దేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరగడం 2000 సంవత్సరం తర్వాత మొదలైంది. 2014–15 నుంచి 2022–23 మధ్యకాలంలో ఈ పెరుగుదల రాకెట్ వేగాన్ని అందుకున్నది. ప్రస్తుతం దేశ వార్షికాదాయాల్లో 22.6 శాతం ఒక్క శాతం జనాభా ఉన్న అగ్రశ్రేణి సంపన్నులే దక్కించుకున్నారు. అయితే జాతి సంపదలో వీరి దగ్గర పోగుపడిన సంపద 40.1 శాతం. ఒక్క శాతం కుబేరుల చేతిలో 40.1 శాతం సంపద కేంద్రీకృత మైంది. ప్రపంచంలో మరే దేశంలోనూ టాప్ ఒక శాతం కుబే రులు ఈ స్థాయిలో దండుకోలేకపోయారు. ఇందులో గోల్డ్ మెడల్ భారత్‌దే! దేశంలోని ఈ కుబేరుల మీద సంపద పన్ను వేసి ప్రభుత్వం ఆ సొమ్మును ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి రంగాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఈ నివేదిక సూచించింది. దేశంలో కేవలం 167 మంది అగ్రశ్రేణి కుబేరుల మీద రెండు శాతం పన్ను వేసినా వచ్చే మొత్తం దేశ వార్షికాదాయంలో 0.5 శాతానికి సమానమట! దీన్ని విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాలని ఈ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చుపెట్టి అభివృద్ధి చేసిన మెడికల్ కాలేజీలను ప్రోత్సాహకాలిచ్చి మరీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలంటున్న చంద్రబాబు ఆర్థిక విధానాలకూ, ఈ ఆర్థికవేత్తల సూచన పూర్తి విరుద్ధంగా ఉండడం మరో గమనించదగిన అంశం.
ఈ నివేదిక ప్రకారం దేశంలోని టాప్ 10 శాతం సంపన్నుల చేతిలో 65 శాతం సంపద పోగైంది. కిందిస్థాయిలో ఉండే 50 శాతం మంది పేదల మొత్తం సంపద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే. మధ్యశ్రేణిలో ఉండే 40 శాతం మంది స్థితిమంతుల వాటా 32 శాతం. భారతదేశంలో ఆర్థిక వ్యవహారా లకు సంబంధించిన గణాంకాలు సమగ్రంగా అందుబాటులో ఉండవనీ, వాస్తవానికి అసమానతలు తాము చెబుతున్నదానికంటే మరింత ఎక్కువ ఉండే అవకాశముందనీ ఈ నివేదిక అభిప్రాయపడింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ జమానాకు ‘బిలియనీర్ల రాజ్’గా అసమానతల నివేదిక నామకరణం చేసింది. ‘బ్రిటిష్ రాజ్’ జమానాలో ఏర్పడిన ఆర్థిక అసమానతల రికార్డును మన ‘బిలియనీర్ల రాజ్’ బద్దలు కొట్టింది.
‘బిజినెస్’ చేయడం ప్రభుత్వాల బిజినెస్ కాదనే ఆకర్ష ణీయమైన కొటేషన్‌ల మాటున కీలకమైన ప్రభుత్వరంగ సంస్థ లను సైతం ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి ఎన్డీఏ సర్కార్ ఓ పాలసీని కూడా తీసుకొచ్చింది. ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ రంగాల పరిశ్రమలు కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. చివరకు గత రెండు దశా బ్దాలుగా గ్రామీణ పేదలకు ఆసరాగా నిలిచి, వలసలకు కొంత మేర అడ్డుకట్ట వేసిన ‘నరేగా’ను సైతం సర్కార్ నిర్వీర్యం చేసింది. డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే కూలీల హక్కును ఈ పథకం నుంచి తొలగించింది. పథకం అమలుకయ్యే వ్యయంలో 40 శాతం రాష్ట్రాలే భరించాలనడంతో నిజస్వరూపం వెల్లడైంది. పథకాన్ని నామమాత్రం చేయడం ఎన్డీఏ ఆర్థిక ప్రాధాన్యతలకు అద్దం పడితే, పథకం పేరులోంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దాని సైద్ధాంతిక విధానంగా పరిగణించవచ్చు. ఆరెస్సెస్ భావజాలం ప్రభావం వల్లనే మహాత్ముడిని గాడ్సే హత్య చేశాడన్న ఆరోపణను నాడు ఆరెస్సెస్ ఖండించింది. ఇప్పుడో కీలకమైన పథకం నుంచి ఆయన పేరును తొలగించడం వెనుక ఆ భావజాలం ప్రమేయం లేదని మాత్రం ఆరెస్సెస్ ఇప్పటి దాకా ఖండించలేదు.

డిసెంబర్ 29వ తేదీనాడు ‘న్యూయార్క్ టైమ్స్’ బ్యానర్ స్టోరీగా ప్రచురించిన కథనం ప్రధానమంత్రి పంద్రాగస్టు అధికా రిక ప్రసంగాన్ని ఉటంకించడంతో మొదలైంది. ఆ ప్రసంగంలో ప్రధానమంత్రి ఆరెస్సెస్‌ను ఒక గొప్ప సేవా సంస్థగా ఆకాశాని కెత్తారు. మోదీ వంటి శక్తిమంతుడైన ప్రధానమంత్రి సుస్థిర పాలనను ఆసరా చేసుకొని ఆరెస్సెస్ బాగా బలపడిందని ఈ కథనం వ్యాఖ్యానించింది. పోలీసులు, రక్షణ శాఖ, ఉన్నతోద్యో గులు, వ్యాపారులు... ఇలా అన్ని రంగాల్లో చిన్న చిన్న ఉప సంఘాల పేరుతో ఆరెస్సెస్ చొచ్చుకొనిపోయిందనీ, దాదాపు రెండు వేల వరకు దాని ఉపసంఘాలు చురుగ్గా పని చేస్తున్నాయనీ, వీటి ప్రభావం వల్ల దేశంలో విద్వేష పూరిత వాతావరణం నెలకొన్నదనీ, దాడులు ముస్లిమ్‌ల వరకే పరి మితం కాలేదు... మతమార్పిడి బూచీని చూపెట్టి చర్చిల మీద, క్రైస్తువుల మీద, క్రిస్మస్ ఉత్సవాల మీద యథేచ్ఛగా దాడులు జరిగాయనీ పత్రికా కథనం ఆరోపించింది. పత్రిక ఆరోపణే కాదు, ఇవన్నీ మన అనుభవంలోకి వచ్చిన తాజా సంఘటనలే!
ప్రజలందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అనే ఆశయం ఆచరణలో అభాసుపాలైంది. సమాజంలో సౌభ్రాతృత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమిస్తున్నది. అయినా మనం రాజ్యాంగబద్ధ పాలనలోనే ఉన్నామా అనే అనుమానం తొలుస్తు న్నది. అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నా, ఉపాధి – ఉద్యో గాలు కొరవడుతున్నా, జాతి సంపదలు ప్రైవేట్ కార్పొరేట్ శక్తు లకు కైంకర్యం అవుతున్నా, పేద, మధ్యతరగతి ప్రజలు నాణ్య మైన విద్యా, వైద్య సౌకర్యాలకు దూరమవుతున్నా, వ్యవసాయ రంగం కుదేలై రైతాంగం వధ్యశిలలపై నిలబడి ఉన్నా పాలక పక్షాలకు జనం సమ్మతి ఎలా లభిస్తున్నది? తమ పాలనపై నోరెత్తే వారిని దండించడానికి అధికార పక్షాలకు ఒక చేతిలో రెడ్ బుక్ ఉన్నట్టే, తటస్థులను సంతృప్తిపరచడానికి మరో చేతిలో ప్రవచనాల పుస్తకం కూడా ఉంటుంది.
మతం పేరుతో,సంస్కృతి పేరుతో, ఆచారాల పేరుతో పౌర సమాజాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఇది అక్కరకొస్తుంది. దీన్నే ఆధిపత్య భావజాలం అంటారు. పౌర సమాజాన్ని ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్నంత కాలం పరిపాలన పురోగమనంలో ఉన్నదా తిరోగమనంలో ఉన్నదా అనే సంగతి జనానికి పట్టకపోవచ్చు. పౌర సమాజంలోని అన్ని పార్శ్వాలను దానికి అర్థమయ్యే భాషలో చైతన్యపరచకుండా మన జాతీయ ప్రతిపక్ష నాయకుడి మాదిరిగా అడపాదడపా స్వయం ప్రకటిత బాంబుల్ని ప్రయోగి స్తానంటే ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఆయన పేలని బాంబుల పేరయ్యగా మిగిలిపోయారు. ప్రగతిశీలమైన భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని అమలుచేసే శక్తులు సమీప భవిష్యత్తులో ముందుకు వస్తాయా? లేక ఆ రాజ్యాంగమే కొంత కాలానికి అదృశ్యమయ్యే రోజును చూస్తామా అనేదే నేడు మనముందున్న కీలకమైన మీమాంస!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


