
మా ఉత్పత్తులకు మీ మార్కెట్లు తెరవాల్సిందే
అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టీకరణ
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్‌ను ఉద్దేశించి కీలక వ్యా ఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలను దారికి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని ఇండియా, బ్రెజిల్ దేశాలకు హితవు పలికా రు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్లు తెరవాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. బ్రెజిల్, ఇండియా, స్విట్లర్లాండ్, తైవాన్ వంటి దేశాల వ్యవహార శైలి తమకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు.
అమెరికా పట్ల నిజంగా స్నేహ పూర్వకంగా ఉండాలనుకుంటే సరిగ్గా ప్రతిస్పందించాలని స్పష్టంచేశారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా పని చేస్తుండడం వల్లనే ఇండియా వంటి దేశాలతో తాము కఠినంగా ఉండాల్సి వస్తోందని లుట్నిక్ తేల్చిచెప్పారు. ‘‘మీ ఉత్పత్తులు అమెరికన్లకు విక్రయించుకోవాలని కోరుకుంటే మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లా డుకోండి. సంధి చేసుకోండి’’ అని సూ చించారు. ఇండియా సహా పలుదేశాల తో వాణిజ్య చర్చలు చురుగ్గా ముందు కు సాగడం లేదని తెలిపారు. ఆయా దేశాల మొండి పట్టుదల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. వివాదాలను త్వరలో పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా
రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి కొనుగోళ్లు ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. భారత్ అందుకు అంగీకరించడం లేదు. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో దురుద్దేశం ఏమీ లేదని చెబుతోంది. భారత్ వాదనను అమెరికా నమ్మడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మీరే నిధులు ఇస్తున్నారంటూ మండిపడుతోంది. మరోవైపు భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా కావడం గమనార్హం. 2024–25లో రెండు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది.