అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘టారిఫ్ వార్’లో మెత్తబడనున్నారా?. వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిన తరుణంలో త్వరలో భారత్‌కు గుడ్‌న్యూస్ అందించబోతున్నారా?. ఇప్పటికి అమలవుతున్న 50 శాతం సుంకాలను గణనీయంగా తగ్గించబోతున్నారా?.. భారత్ చెందిన ఓ వార్తా సంస్థ కథనం అవుననే అంటోంది.
అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ తాజాగా దీపావళి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీతోనూ ఈ అంశంపైనే మాట్లాడానని అన్నారాయన. ఇటు ట్రంప్ ఫోన్‌కాల్‌ను ధృవీకరించిన మోదీ.. ఏ అంశాలపై మాట్లాడరనేది మాత్రం చెప్పలేదు. ఈలోపు.. జాతీయ ఆంగ్ల పత్రి మింట్ ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ట్రేడ్‌డీల్‌కు భారత్-అమెరికా చేరువయ్యాయని, ఇందులో భాగంగానే భారత్‌పై అమెరికా విధించిన సుంకాల్లో భారీగా తగ్గుదల ఉండబోతోందని ఆ కథనంలో ఉంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోళ్లపైనా ఈ ఒప్పందం ప్రభావం చూపించబోతోందని పేర్కొంది. క్రమక్రమంగా తగ్గించే అవకాశం ఉందని ప్రస్తావించింది.
అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం శక్తి(ఎనర్జీ), వ్యవసాయ రంగాలపై ఆధారపడి ఉండబోతోంది. ఈ తగ్గింపుతో సుంకాలు 50 శాతం నుంచి 15-16 శాతానికి చేరుకుంటాయి. భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణాన్ని క్రమంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు ముగ్గురికి మాత్రమే తెలుసు అని మింట్ కథనం పేర్కొంది.
అమెరికా నుంచి దిగుమతి అయ్యే జన్యుపరంగా మార్పులు చేయని మొక్కజొన్న, సోయా ఆహార పదార్థాలపై పన్నులు తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని తరచుగా సమీక్షించే విధానాన్ని కూడా చేర్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాసింది. ఈ కథనంపై మరో ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్.. ఇటు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖను, అటు వైట్‌హౌజ్‌ను సంప్రదించింది. అయితే.. ఇరువర్గాలు దీనిపై స్పందించలేదు.
47వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశం 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశానికి ఆసియాన్ దేశాల నాయకులతో పాటు అమెరికా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సైప్రస్, ఫిన్లాండ్ దేశాల నాయకులు కూడా హాజరుకానున్నారు. ప్రాంతీయ సహకారానికి, ద్వైపాక్షిక ఒప్పందాలకు కీలక వేదికగా ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ఓ పేరుంది.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాల టైమ్‌లైన్
2023 జూన్: భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వ్యవసాయం, టెక్నాలజీ, ఇంధన రంగాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.
2023 ఆగస్టు: అమెరికా భారత దిగుమతుల పన్నులపై సమీక్ష ప్రారంభించింది. దీంతో చర్చలు కొంతకాలం నిలిచిపోయాయి.
2024 ఫిబ్రవరి: వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతుల పరిమితులు, పన్నుల తగ్గింపు అంశాలపై చర్చలు కొనసాగాయి.
2024 జూన్: భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(MSMEs), రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది.
2024 డిసెంబర్: పన్నుల సమీక్ష విధానం ప్రతిపాదించబడింది. మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తుల దిగుమతులపై దృష్టి సారించాయి.
2025 సెప్టెంబర్ 16: ఆగిపోయిన వాణిజ్య చర్చలు.. ట్రంప్ సుంకాల ప్రభావంతో తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధులు భారత్‌కు చర్చల కోసం వచ్చారు.
2025 అక్టోబర్ 13–20: చర్చలు తుది దశకు చేరాయి. ట్రంప్-మోదీలు ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.
2025 అక్టోబర్ 22: వాణిజ్య ఒప్పందం తుది రూపు దిద్దుకుంటోంది. మింట్ నివేదిక ప్రకారం.. అమెరికా 50% టారిఫ్‌ను 15–16%కి తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది


