
టారిఫ్ వార్‌తో మొదలైన అమెరికా-భారత్ ఉద్రిక్తతలు.. ట్రంప్-మోదీ పరస్పర సోషల్ మీడియా స్నేహపూర్వక సందేశాలతో కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. ఈ తరుణంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్(John Bolton) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత.. సోషల్ మీడియా విమర్శలు పక్కనపెట్టి వాస్తవిక వ్యూహాత్మక చర్చలు జరగాలని ఇరు దేశాలకు సూచించారాయన.
అంతేకాదు.. ట్రంప్ వాణిజ్యసలహాదారు పీటర్ నవారో(Peter Navarro) వల్లే భారత్, అమెరికా మధ్య సంబంధాలు చెడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని బోల్టన్ అంటున్నారు. తాజాగా భారత్‌కు చెందిన ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలే వెల్లడించారు.
పీటర్ నవారో అనే వ్యక్తి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య గొడవను ప్రేరేపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నవారో అనే వ్యక్తి ఎలాంటి వారంటే.. ఒక గదిలో ఆయన్ని మాత్రమే ఉంచండి. ఓ గంట తర్వాత వచ్చి చూడండి. ఆయనతో ఆయనే గొడవ పడుతుంటాడు.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. అయితే..

భారత్‌పై నవారో చేస్తున్న ఆరోపణలు తీవ్రతతో కూడుకున్నవే అయినప్పటికీ.. ప్రాధాన్యత లేని అంశంగా ఇరు దేశాలు భావించాలి. అసలు వాణిజ్య చర్చలు ప్రామాణిక ప్రతినిధుల మధ్య జరగాలి. అలాగే.. భారత్ సోషల్ మీడియా తరఫున బెదిరింపులు, గందరగోళం లాంటివి లేకుండా ఉంటే మరీ మంచిది. అప్పుడే.. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణంలో ఒప్పందానికి అవకాశం ఉంటుంది.

అలాగని ఈ సమస్యలు తేలికగా.. త్వరగా పరిష్కారమవుతాయన్నది నేను అనుకోవడం లేదు. కానీ రెండు పక్షాల్లోనూ మంచి నమ్మకం ఉంటుందని.. అదే మార్గం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది అని భావిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అంతర్జాతీయ సంబంధాలను తన వ్యక్తిగత సంబంధాలతో పోల్చుకుంటారు. ఉదాహరణకు.. ట్రంప్ మోదీ(modi) మధ్య మంచి సంబంధం ఉంటే.. ఆయన దృష్టిలో భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నట్లే అని బోల్టన్ చెప్పారు. కాబట్టి ఇరు దేశాధినేతల మధ్య ప్రజాస్వామ్యానికి హాని కలిగించే గొడవలు కాకుండా.. నిజమైన వ్యూహాత్మక చర్చలు జరగాలని బోల్టన్ ఆశించారు.

ఇదిలా ఉంటే.. భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ టారిఫ్‌లను కొందరు అమెరికా విశ్లేషకులు తప్పుపట్టగా.. పీటర్ నవారో, బెసెంట్ వంటి వారు మాత్రం భారత్‌ను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయినప్పటికీ రష్యాతో భారత్ కొనసాగిస్తున్న విధానాలపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. భారత్‌ను టారిఫ్ మహారాజా అని పిలుస్తూ.. రష్యా చమురు కొనుగోలుపై బ్లడ్ మనీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన ఆరోపణలు అబద్ధమని ఎక్స్ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. అయినప్పటికీ.. నవారో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. అంతేకాదు.. భారతీయ సోషల్ మీడియా యూజర్లను కీబోర్డ్ మినియన్స్(తెలివి తక్కువ, పనికి మాలిన అని నానార్థాలు వస్తాయి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు భారతీయులు నవారోని టార్గెట్ చేస్తూ పోస్టులతో తిట్టిపోస్తున్నారు.