
రష్యా చమురు, ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ట్రంప్ కోపం ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈయూ, జీ7, నాటో సహా పలు దేశాలపైనా ఆయన ఒత్తిడి చేస్తుండడం చూస్తున్నాం. అమెరికాలాగే ఆ దేశాలకు భారతీయ వస్తువులపై సుంకాల మోత మోగించాలంటూ సూచిస్తున్నారాయన. అయితే ఈ విషయంలో ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది!.
తాజాగా ఈ పరిణామంపై రష్యా స్పందించింది. భారత్‌తో తమ సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని.. ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీయాలనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమెరికాకు మెత్తగా మొట్టికాయలు వేసింది.
‘‘ఇండియా-రష్యా సంబంధాలు స్థిరంగా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ బంధాన్ని భంగం చేయాలనే ప్రయత్నాలు విఫలం కాక తప్పదు. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు ఇండియాను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం అని రష్యా విదేశాంగ శాఖ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది.
ఇండియా వైఖరి.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇండియా-రష్యా స్నేహబంధం స్ఫూర్తి, సంప్రదాయాలపై ఆధారపడి ఉంది. ఇది అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వయం ఇండియా నిర్ణయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇరు దేశాలు మిలిటరీ ఉత్పత్తులు, అంతరిక్ష మిషన్లు, అణు శక్తి, రష్యన్ చమురు పరిశోధనలో భారత పెట్టుబడులు వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. నూతన చెల్లింపు వ్యవస్థలు, జాతీయ కరెన్సీల వినియోగం, పరస్పర రవాణా మార్గాల అభివృద్ధి వంటి అంశాల్లో కూడా సహకారం కొనసాగుతోంది అని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై తొలుత 25% ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అటుపై రష్యా చమురు, రక్షణ సామాగ్రి కొనుగోళ్ల నేపథ్యంతో పెనాల్టీ కింద మరో 25% శాతం విధించారు. ఈ టారిఫ్‌లను భారత్ అన్యాయంగా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం జాతీయ ప్రయోజనాల, మార్కెట్ అవసరాల ఆధారంగా జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రష్యా భారత్ ఆర్థిక వ్యవస్థలు డెడ్.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ సంచలన కామెంట్ చేశారు. అయినప్పటికీ..
అమెరికా ఒత్తిడికి తలవంచే ప్రసక్తే లేదని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు తమ దేశానికి ఉందని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగానే ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా అలస్కాలో పుతిన్‌తో భేటీ తర్వాత ట్రంప్ స్వరం కాస్త తగ్గింది. ఉక్రెయిన్ డీల్ కుదిరితే భారత సుంకాల విషయంలో ఆలోచన చేయొచ్చని అన్నారాయన. అయితే..
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరాలంటే.. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై రాయితీలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టేసింది. ఈ క్రమంలో.. ఈ రంగాలను రెడ్ లైన్స్‌గా red linesగా అభివర్ణించింది. మరోవైపు.. ఎగుమతిదారులపై ప్రభావం తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతు ప్యాకేజీలు ప్రకటించే అవకాశముందనే విశ్లేషణ నడిచింది. ఈలోపు ట్రంప్-మోదీల పరస్పర సోషల్ మీడియా సంభాషణతో ఈ చర్చలు ముందుకు సాగవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది.