
న్యూడిల్లీ: వేరుగా ఉంటున్న భార్యను ఆమె దుస్తులు, ఇతర వస్తువుల్ని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్న ఓ భర్తపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమని పేర్కొంది. ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులను 24 గంటల్లోగా అప్పగించాలని అతడిని ఆదేశించింది. దీపావళి పండుగ జరుపుకునేందుకు తన కుమారుడిని తనతో ఇంటికి పంపించేలా భార్యను ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఆమె కుమారుడిని భర్తతో పంపేందుకు నిరాకరించింది.
2022 నుంచి అత్తింట్లో ఉన్న తన వస్తువులను అతడు తీసుకెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది. స్పందించిన ధర్మాసనం ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించింది. ‘వివాహాలు కొన్ని విఫలమవుతుంటాయి. కానీ, భార్య తన దుస్తులు తీసుకోవడానికి కూడా భర్త అనుమతించనంత స్థాయికి దిగజారకూడదు. కలిసి ఉండలేని పరిస్థితి వేరు. ఆమె వస్తువులను 24 గంటల్లో తిరిగి అప్పగించాలని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా, తల్లి, తండ్రి కలిసి తమ కుమారుడిని దగ్గర్లోని గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలని, కావాలనుకుంటే అమ్మమ్మ, తాతయ్యలు కూడా వారితో వెళ్లవచ్చని ధర్మాసనం పేర్కొంది.