
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానిలో వాయుకాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది(Delhi Pollution). సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. ఆదివారం వాయునాణ్యత(AQI) సూచీ 300 మార్కు దాటింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత పడిపోవడంతో విజిబిలిటీ తగ్గింది. దీంతో గ్రాప్-2 చర్యలను అమల్లోకి తెచ్చారు.
గ్రాప్-2(GRAP-2) చర్యల నేపథ్యంలో.. ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిపై నిషేధం ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత ఐదు రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని.. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని.. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ చెబుతుంది.
ఇదీ చదవండి: ‘దీపాలపై డబ్బులు తగలేయొద్దు!’