
విద్యుత్ దీపాలతో దీపావళి నిర్వహించుకోవాలి
క్రిస్మస్‌ను చూసి నేర్చుకోవాలి: అఖిలేశ్ యాదవ్
లక్నో: దీపావళి వేడుకలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీపాలు, కొవ్వొత్తులపై అనవసరంగా డబ్బులు తగలేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీపాలు వెలిగించడానికి ప్రజల సొమ్ము వృథా చేయొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘సలహాలు ఇవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ, రాముడి పేరిట ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. కొన్ని నెలలపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. నగరాలు, ఇళ్లను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. మనం కూడా అలా ఎందుకు చేయకూడదు? క్రిస్మస్ నుంచి మనం ఎందుకు నేర్చుకోకూడదు. దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈ విషయం అందరూ ఆలోచించాలి. డబ్బులు వృథా చేయొద్దు. ప్రభుత్వం నుంచి మనం కోరుకొనేది ఆదే. విద్యుత్ దీపాలతో దీపావళి వేడుకలు చేసుకుందాం’’ అని ప్రజలకు అఖిలేశ్ యాదవ్ సూచించారు.
ఆ దుర్గతి హిందువులకు పట్టలేదు: వీహెచ్‌పీ
అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దీపావళి సందర్భంగా క్రిస్మస్‌ను ప్రశంసిస్తున్నాడని, ఈ విషయం ప్రజలు గమనించాలని కోరారు. వరుస దీరిన దీపాలు అఖిలేశ్ హృదయాన్ని కాల్చేస్తున్నాయని చెప్పారు. అందుకే దీపాలపై డబ్బులు ఖర్చు చేయొద్దని చెబుతున్నాడని, క్రిస్మస్‌ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నాడని విమర్శించారు. అఖిలేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు స్పష్టంచేశారు.
ఆయన ఆంటోనీ లేదా అక్బర్: బీజేపీ
అఖిలేశ్ యాదవ్‌పై మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి, బీజేపీ నాయకుడు విశ్వాస్ సారంగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అఖిలేశ్‌ను ఆంటోనీ లేదా అక్బర్ అని పిలవాలని అన్నారు. ఆయన మతం మారినట్లు కనిపిస్తోందని చెప్పారు. ప్రమిదలు తయారు చేసి, మన ఇళ్లల్లో వెలుగులు నింపే పేద కారి్మకులను అవమానిస్తారా? అని విశ్వాస్ సారంగ్ నిప్పులు చెరిగారు.