ప్రతిపక్ష ఇండియా కూటమికి వరుస ఎన్నికల్లో ఓటములతో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఈ తరుణంలో నాయకత్వ మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేననే ప్రత్యక్షంగా.. పరోక్షంగా పలువురు అంటున్నారు. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.
2023 జులై 17వ తేదీన బెంగళూరులో జరిగిన సమావేశంలో 26 పార్టీలు ఇండియ కూటమి ఏర్పాటు ప్రకటన చేశాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ సారథ్యంలోనే ఈ కూటమి ముందుకు నడుస్తోంది. అయితే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో.. నాయకత్వ మార్పు గురించి చర్చలు మొదలయ్యాయి. సమాజ్‌వాది పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తాజాగా.. ఆ పార్టీ అధినేత, కన్నౌజ్ ఎంపీ అయిన అఖిలేశ్ యాదవ్ ప్రతిపక్ష కూటమిని నడిపించాలని కోరారు. అంతేకాదు దేశ రాజకీయాల్లో అత్యంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన సమాజ్‌వాదికి.. యూపీలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సామర్థ్యం ఉందని కూడా వ్యాఖ్యానించారు.
గత సంవత్సరం జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో 37 స్థానాలు గెలుచుకున్న సమాజ్‌వాది పార్టీ.. లోక్‌సభలో కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది. బిహార్ ఫలితంపై లక్నో సెంట్రల్ ఎమ్మెల్యే రవీదాస్ మాట్లాడుతూ.. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగి ఉంటే ఇండియా కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేసేదన్నారు. ‘‘ఈవీఎంల పని తీరును మా అధినేత అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని.. ఆ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు కూడా. ఇందుకోసమైనా ఇండియా కూటమికి సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నాయకత్వం వహించాలి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సామర్థ్యం కలిగి ఉందనే విషయం గుర్తించాలి’’ అని అన్నారు.
గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న ప్రధాన ప్రతిపక్షం.. ఆ తర్వాత జరిగిన వరుస రాష్ట్ర ఎన్నికల్లో ఘోరమైన ఫలితాల్ని ఇస్తోంది. గత ఏడాది కాలంలో.. ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆరింటిలోబీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి, అందులో హర్యానా, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
ఇండియా కూటమిలో నాయకత్వ చర్చ కొత్తదేం కాదు. ఎన్నికల్లో ప్లాఫ్ షో ప్రదర్శించినప్పుడల్లా ఇది చర్చకు వస్తూనే ఉంది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఇండియా కూటమికి స్పష్టమైన నాయకత్వం లేదు. కాంగ్రెస్ ఆ బాధ్యతల్లో విఫలమవుతూ వస్తోంది. కాబట్టి.. స్పష్టమైన ఎన్నిక జరగాలి అని టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ గతంలో అన్నారు. కాంగ్రెస్‌పై తాము విశ్వాసం ఉంచామని.. కానీ ఈ విషయంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమవుతోందంటూ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆయన పై వ్యాఖ్య చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే..
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇండియా కూటమి నాయకత్వం మార్పు అవసరమని గతంలో సూచించారు. మమతా బెనర్జీకి ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్సే ఉంటుంది. అందులో ఎలాంటి తేడా ఉండబోదు కదా. అలాంటప్పుడు ఆమెకు(మమతా బెనర్జీని ఉద్దేశించి) ఇండియా కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలి అని లాలూ అప్పట్లో అన్నారు.


