సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఆరోపణలపై చర్చ, నీటి కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది.
వివరాల మేరకు.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు వారికి ఆహ్వానం అందింది.
ఈ సమావేశంలో కృష్ణ-గోదావరి నదీజలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే, నీటి కేటాయింపులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2014 నుంచి నేటి వరకు కృష్ణా-గోదావరి నదిలో నీటి కేటాయింపులు , బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ అవగాహన కల్పించనున్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశంలో అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.


