
ఆ జంటకు పెళ్లై.. నాలుగు నెలలే అయ్యింది. బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె మృతదేహంగా మంచం కింద కనిపించింది. భర్త జాడ లేకుండా పోయాడు. అతని తల్లే ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.
కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు(Belagavi Husband Kills Wife). ఈ జంటకు ఈ ఏడాది మే నెలలోనే వివాహం జరిగింది.
పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లికి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూడగా.. పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఆకాశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని సాక్షి కుటుంబం ఆరోపిస్తోంది(Dowry Harassment). అయితే ఆకాశ్ తల్లి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఓ గర్భవతిని ఆమె భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం చితక్కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) ప్రకారం.. వరకట్న వేధింపుల ఘటనలు, ఆ వేధింపుల కారణంగా మరణిస్తున్న కేసులూ దేశంలో అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ జాబితాలో యూపీ, బీహార్ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది.
ఇదీ చదవండి: సీనియర్లు వేధించారనే ఐపీఎస్ సూసైడ్!