
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం
భార్య, ఆమె ప్రియుడు, స్నేహితుడు అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య, ఆమె ప్రియుడు, స్నేహితుడ్ని మేడికొండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు.. గుంటూరు పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ చెన్నంశెట్టి గోవిందరాజుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన లక్ష్మీతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. భార్య, భర్త మధ్య గొడవలు చెలరేగడంతో.. ఆరేళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం లక్ష్మీకి సత్తెనపల్లికి చెందిన పేర్నేపాటి వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో గోవిందరాజు కుటుంబానికి సంబంధించిన రూ.1.5 కోట్ల ఆస్తి గురించి తెలుసుకున్న లక్ష్మి భర్తను హత్య చేసి.. ఎలాగైనా ఆస్తిలో వాటా దక్కించుకోవాలని భావించింది. ఇందుకు వెంకటేశ్వర్లుతో కలిసి కుట్ర పన్నింది. ఆ ప్రకారం.. వెంకటేశ్వర్లు, అతని స్నేహితుడు షేక్ ఖాసిం సైదా సెపె్టంబర్ 18న ఆటోలో గోవిందరాజు ఇంటికి వెళ్లారు. వెంకటేశ్వర్లు, గోవిందరాజుకు గతంలో పరిచయం ఉంది. దీంతో ముగ్గురూ కలసి ఆటోలో తిరుగుతూ మద్యం తాగారు. ఈ క్రమంలో సాతులూరు, పెదరెడ్డిపాలెం గ్రామాల మధ్య.. గోవిందరాజుతో వెంకటేశ్వర్లు గొడవ పడ్డాడు.
పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోవిందరాజును.. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు తీసుకెళ్లి ఇనుప రాడ్డుతో మోది హత్య చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీకి తెలియజేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని 19వ తేదీన పెదపలకలూరు తేజ గార్డెన్స్ సమీపంలో పడేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐ నాగూర్మీరాసాహెబ్, సిబ్బంది దర్యాప్తు చేసి.. వెంకటేశ్వర్లు, అతని మిత్రుడు షేక్ ఖాసింసైదాను అరెస్టు చేశారు.