
దీపావళిని పురస్కరించుకుని సోమవారం గోవా, కర్వార్ తీరంలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో నేవీ సిబ్బందితో ప్రధాని మోదీ
అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాం
దీపావళి సందర్భంగా మోదీ లేఖ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ధర్మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని బోధించడంతోపాటు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని శ్రీరాముడు మనకు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సిందూర్ ద్వారా ధర్మాన్ని స్థాపించామని, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నామని స్పష్టంచేశారు. ఈ ఏడాది దీపావళికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. దేశంలోని మారుమూల జిల్లాల్లోనూ తొలిసారిగా దీపాల వెలుగులు విరజిమ్మాయని తెలిపారు. అక్కడ నక్సలిజం అంతం కావడంతో ప్రజలు ఉత్సాహంగా దీపావళి నిర్వహించుకున్నారని వివరించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ మంగళవారం దేశ ప్రజలకు లేఖ రాశారు. ప్రధానమంత్రి లేఖలోని వివరాలివీ..
స్థిరత్వం, ప్రగతికి ప్రతీక భారత్
‘‘చాలా జిల్లాల్లో నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం సమూలంగా తుడిచిపెట్టుపోతున్నాయి. మావోయిస్టులు హింసను వదిలేసి లొంగిపోతున్నారు. ప్రధాన అభివృద్ధి స్రవంతిలో కలిసిపోతున్నారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విధేయత చూపుతున్నారు. ఇది నిజంగా మన దేశం సాధించిన అతిపెద్ద ఘనతగా చెప్పాలి. తదుపరి తరం సంస్కరణలకు ఇటీవల శ్రీకారం చుట్టాం. నవరాత్రుల తొలిరోజు నుంచి జీఎస్టీ రేట్లు తగ్గించాం. జీఎస్టీ బచత్ ఉత్సవంతో దేశ ప్రజలకు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్రపంచమంతటా సంక్షోభాలు, సమస్యలు నెలకొన్న తరుణంలోనూ భారత్‌లో అభివృద్ధి పరుగులు ఆగడం లేదు. స్థిరత్వం, ప్రగతికి ప్రతీకగా మారింది. మనం త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయం.
దివ్య దీపాలు వెలిగిద్దాం
దీపావళి పండుగ గొప్ప పాఠం నేరి్పస్తోంది. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. దాంతో కాంతి మరింత పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గదు. అదేతరహాలో ఈ దీపావళి సందర్భంగా చుట్టూ ఉన్న సమాజంలో సామరస్యత, సౌభ్రాతృత్వం, సహకారం, సానకూలత అనే దివ్య దీపాలు వెలిగిద్దాం. అయోధ్యలో భవ్య రామమందిరం ప్రాణప్రతిష్ట తర్వాత మనకు ఇది రెండో దీపావళి. మనలో శక్తిని, ఉత్సాహాన్ని నింపే గొప్ప పండుగ ఇది. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
స్వదేశీని ఆదరించండి
‘దేశ పౌరులుగా మన ప్రాథమిక బాధ్యతలు, విధులు తప్పనిసరిగా నెరవేర్చాలి. దేశ అభివృద్ధే ధ్యేయంగా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, వినియోగించుకోవాలి. ‘ఇది స్వదేశీ’ అని గర్వంగా చెప్పుకోవాలి. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్దాం. అన్ని భాషలనూ గౌరవిద్దాం. రోజువారీ జీవితంలో స్వచ్ఛతకు పెద్దపీట వేద్దాం. పరిశుభ్రతే మన నినాదం కావాలి. ప్రజలంతా ఆరోగ్య సంరక్షణకు అత్య ధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో మంచినూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకుందాం. అదేసమయంలో యోగా చేయాలని ప్రజలను కోరుతున్నానని మోదీ సూచించారు’