
2024–25లో 41 నూతన వైద్య కళాశాలలు
ఆమోదం తెలియజేసిన జాతీయ మెడికల్ కమిషన్
న్యూఢిల్లీ: వైద్య విద్య అభ్యసించాలని కోరుకొనే ఔత్సాహికులకు శుభవార్త. దేశంలో 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ఆమోదం తెలియజేసింది. అలాగే కొత్తగా 41 వైద్య కశాళాలలు కూడా రాబోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య 816కి చేరుకోనుంది. రాబోయే ఐదేళ్లలో కొత్తగా 75 వేల ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు 2024లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్య విద్యను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే 10,650 సీట్లకు తాజాగా ఆమోదం లభించింది.
మరో 5,000 పీజీ మెడికల్ సీట్లు
అండర్‌గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ సీట్ల విస్తరణకు వైద్య కళాశాలల నుంచి 170 దరఖాస్తులు వచ్చాయని ఎన్‌ఎంసీ చైర్‌పర్సన్ డాక్టర్ అభిజాత్ సేథ్ చెప్పారు. ఇందులో 41 దరఖాస్తులు ప్రభుత్వ కాలేజీల నుంచి, 129 దరఖాస్తులు ప్రైవేట్ కాలేజీల నుంచి వచ్చినట్లు తెలిపారు. కొత్తగా 10,650 సీట్ల రాకతో 2024–25లో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,37,600కు చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఇక పోసు్ట్రగాడ్యుయేట్ సీట్ల విషయంలో 3,500 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈసారి మరో 5,000 పీజీ మెడికల్ సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో దేశమంతటా మొత్తం పీజీ సీట్ల సంఖ్య 67,000కు చేరుతుందని స్పష్టంచేశారు. ఈ ఏడాది మొత్తంగా 15,000 యూజీ, పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పారు.
ఐసీఎంఆర్‌తో వైద్య విద్య అనుసంధానం
యూజీ, పీజీ సీట్లకు తుది అనుమతి, కౌన్సెలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, నిర్దేశిత గడువులోగానే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అక్రెడిటేషన్, పరీక్షలు, సీట్ల ఆమోదానికి త్వరలో బ్లూప్రింట్‌ను ప్రచురించబోతున్నారు. 2025–26లో దరఖాస్తులకు పోర్టల్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని అధికారులు వివరించారు. వైద్య విద్యలో నాణ్య తను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని డాక్టర్ అభిజాత్ సేథ్ తెలిపారు. మెడికల్ పాఠ్య ప్రణాళిక(కరిక్యులమ్)లో క్లినికల్ రీసెర్చ్‌ను అంతర్భాగంగా చేర్చబోతున్నట్లు స్పష్టంచేశారు.