
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి అంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. దీపావళి సందర్భంగా ఆయన లేఖ రాస్తూ.. ఈ ఆపరేషన్‌లో భారత్ తన ధర్మాన్ని నిలబెట్టుకొంటూనే.. ఉగ్రవాదంపై ప్రతీకారం కూడా తీర్చుకొందన్నారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టాలని మనకు బోధిస్తారు, అదే సమయంలో అన్యాయంపై పోరాడే ధైర్యాన్ని కూడా ఇస్తారు. దీనికి సజీవ ఉదాహరణను మనం కొన్ని నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ సమయంలో చూశాం’’ అంటూ ప్రధాని లేఖలో పేర్కొన్నారు.
‘‘ఈ దీపావళి ప్రత్యేకమైంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా, మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో దీపాలు వెలిగించబడ్డాయి. ఈ జిల్లాల నుంచి మావోయిస్టులను నిర్మూలించాం. ఇటీవల కాలంలో మావోయిస్టులు హింస మార్గాన్ని విడిచిపెట్టి.. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ జనజీవన స్రవంతిలోకి చేరడాన్ని మనం చూశాము. ఇది దేశానికి ఒక పెద్ద విజయం.
..ప్రపంచ సంఘర్షణలు ఉన్నప్పటికీ, దేశం స్థిరత్వం, సున్నితత్వం రెండింటికీ చిహ్నంగా ఉద్భవించింది. సమీప భవిష్యత్తులో మనం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించబోతున్నాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.