
ఢిల్లీ: ఆసియా కప్ (Asia Cup)లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి ఘటన బాధితులు స్పందిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత ప్రభుత్వం, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన తమ వారిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథా అని అనిపిస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై పహల్గాం బాధిత కుటుంబాలు స్పందిస్తున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాక్‌తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డాం. పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు ఉండొద్దు. మీరు మ్యాచ్ ఆడాలి అనుకుంటే దాడి ప్రాణాలు కోల్పోయిన మా వారిని తీసుకురావాలి. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ప్రధాని మోదీ చెప్పారు. మరి పాకిస్తాన్‌తో ఎందుకు మ్యాచ్ నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించారు.
ఆపరేషన్ సిందూర్ ఎందుకు?
మరోవైపు.. పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందిస్తూ.. భారత్-పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కేవలం ఇద్దరు ముగ్గురు క్రికెటర్లే ముందుకువచ్చారు. మిలిగిన వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పాక్‌తో మ్యాచ్ ఆడాలని క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దని.. దేశం తరఫున నిలబడాలని సూచించాలన్నారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. పహల్గాం దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌తో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే ఉపయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యాచ్‌ను నిర్వహిస్తే.. మనపై దాడి చేయడానికి వారిని మనమే సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. దేశ ప్రజలంతా భారత్-పాక్ మ్యాచ్‌ను చూడకుండా బహిష్కరించాలని కోరారు.
నా తమ్ముడిని తీసుకురండి: సావన్
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సావన్ పర్మార్.. తన తండ్రితో పాటు సోదరుడు కూడా ఉగ్రవాదుల కాల్పులకు బలై ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్‌పై సావన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మీకు మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన నా 16 ఏళ్ల తమ్ముడిని తిరిగి తీసుకురండి. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథానేమో అనిపిస్తోంది. పహల్గాంలో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను చంపిన తర్వాత కూడా ఈ మ్యాచ్ ఆడటం సరికాదు అని ఘాటు విమర్శలు చేశారు.
మా బాధ మీకు పట్టదా?
మరోవైపు.. సావన్ తల్లి కిరణ్ యతీష్ పర్మార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాల గాయాలు ఇంకా మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ఇలాంటి సమయంలో భారత్-పాక్ మ్యాచ్ ఎందుకు జరుగుతోందని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘ఈ మ్యాచ్ జరగకూడదు. నేను ప్రధానమంత్రి మోదీని అడగాలనుకుంటున్నాను. ఆపరేషన్ సిందూర్ ముగియనప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు జరుగుతోంది? పహల్గాం ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను ఒకసారి సందర్శించి, వారి బాధ ఎలా ఉందో చూడాలని దేశంలోని ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మా గాయాలు ఇంకా మానలేదు’ అని అన్నారు.