
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిల్చోబెట్టాం
పహల్గాం ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం
9 అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలను నేటమట్టం చేశాం
నా సిరల్లో రక్తం బదులు వేడివేడి సిందూరం ప్రవహిస్తోంది
ఆయుధాలు చూసుకొని విర్రవీగినవారు మట్టిలో కలిసిపోయారు
భారతీయుల రక్తం పారించాలని చూస్తే భారీ మూల్యం చెల్లించాలి
పాకిస్తాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
బికనెర్/జైపూర్: పహల్గాం ఉగ్రవాద దాడికి కేవలం 22 నిమిషాల్లో సరైన జవాబు ఇచ్చామని, ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. పవిత్ర సిందూరం మందుగుండుగా(గన్‌పౌడర్) మారితే ఏం జరుగుతుందో మన శత్రువులతోపాటు ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్బోబెట్టామని, మన సైనిక దళాలు అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించాయని, ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేశాయని ప్రశంసించారు.
ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్‌లో పర్యటించారు. పాకిస్తాన్ సరిహద్దులోని బికనెర్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే 9 అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని వెల్లడించారు. తన సిరల్లో రక్తం బదులు వేడివేడి సిందూరం ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రదాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
అణ్వాయుధాలకు భారత్ భయపడదు
‘‘ఉగ్రవాద దాడికి భారత్ ప్రతిస్పందనను ప్రతీకార చర్యగా చూడొద్దు. ఇదొక కొత్త రకమైన న్యాయం. ఇది ఆపరేషన్ సిందూర్. ఇది ఆగ్రహం కాదు.. దేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీక. ఇది నూతన భారతదేశం. పాకిస్తాన్‌తో వ్యాపారం, వాణిజ్యం జరిపే ప్రసక్తే లేదు. పొరుగు దేశంతో ఇకపై చర్చలంటూ జరిగితే కేవలం ఉగ్రవాదులు, పాక్ ఆక్రమిత కశీ్మర్(పీఓకే)పైనే జరుగుతాయి. అణ్వాయుధాలు చూపించి బెదిరిస్తామంటే ఇక్కడ బెదిరిపోయే వాళ్లు ఎవరూ లేరు.
అణ్వస్త్రాల ముప్పు చూసి భారత్ భయపడదు. దేశంలో ఇకపై ఉగ్రదాడులు జరిగితే ఎలా బదులివ్వాలో మాకు బాగా తెలుసు. ముష్కర మూకలకు అర్థమయ్యే రీతిలోనే బుద్ధి చెప్తాం. ఉగ్రవాదులపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు చేయాలో మన సైనిక దళాలే నిర్ణయిస్తాయి. మన జవాన్లకు ఆ స్వేచ్ఛ ఉంది. ఉగ్రవాద దాడుల కుట్రదారులను, పాక్ ప్రభుత్వ అండతో చెలరేగిపోతున్న ఉగ్రవాదులను వేర్వేరుగా చూడం. వారందరినీ ఒక్కటిగానే పరిగణిస్తాం. ఆపరేషన్ సిందూర్ నుంచి ఈ మూడు సూత్రాలు తీసుకున్నాం. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదుల ఆటలు ఇకపై సాగవు.
ఐసీయూలోకి చేరిన పాక్ ఎయిర్‌బేస్
బికనెర్ జిల్లాలోని నాల్ ఎయిర్‌బేస్‌పై దాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం ప్రయత్నించింది. కానీ, మన ఎయిర్‌బేస్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. పాక్ చర్యకు బదులుగా మన సైన్యం పాకిస్తాన్‌లోని రహిమ్యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగింది. దాంతో అది చాలావరకు ధ్వంసమైంది. ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికీ తెలియదు. భారత్‌పై ప్రత్యక్ష యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పటికీ నెగ్గలేదు.
భారత్‌తో తలపడినప్పుడల్లా పరాజయమే చవిచూసింది. అందుకే ప్రత్యక్షంగా ఎదుర్కొనే సత్తా లేక ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. దొంగదెబ్బ తీయాలని చూస్తోంది. 2019లో బాగల్‌కోట్ వైమానిక దాడుల తర్వాత రాజస్తాన్‌లో మాట్లాడుతూ మన దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచనివ్వబోనని ప్రతిజ్ఞ చేశా. అదే రాజస్తాన్ గడ్డపై దేశ ప్రజలకు మరో మాట చెబుతున్నా. మన ఆడబిడ్డల సిందూరం తుడిచేయాలని చూసే ఉగ్రవాదులను ఏరిపారేస్తాం. మన రక్తం పారించాలని కుట్రలు చేస్తే ప్రతి రక్తం బొట్టుకు ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదు’’ అని మోదీ స్పష్టం చేశారు.

ఉగ్రవాదులను ఎగుమతి చేసినంత కాలం భిక్షం ఎత్తుకోవాల్సిందే!
‘‘ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అమాయకులను హత్య చేస్తూ మన దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలన్నదే పాక్ ఎత్తుగడ. కానీ, ఇక్కడ భరతమాత సేవకుడు మోదీ ఉన్నాడు. తలెత్తుకొని నిల్చున్నాడు. మోదీ మనసు ప్రశాంతంగానే ఉండొచ్చు.. అతడి రక్తం మాత్రం సెగలు కక్కుతోంది. ఉగ్రవాదులను ఎగుమతి చేసినంత కాలం పాకిస్తాన్‌కు పూట గడవదు. భిక్షం ఎత్తుకోవాల్సిందే. ఇండియా నుంచి ప్రవహించే నదుల్లో వాటా కూడా దక్కదు.
భారతీయుల రక్తంతో ఆటలాడితే అందుకు చెల్లించే మూల్యం ఊహించనంతగా ఉంటుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. ఉగ్రవాద భూతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడమే మన సంకల్పం. దీన్నుంచి మనల్ని ప్రపంచంలోని ఏ శక్తి కూడా వేరుచేయలేదు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన సంకల్పాన్ని ఇతర దేశాలకు తెలియజేయడానికే అఖిలపక్ష బృందాలను పంపించాం. పాకిస్తాన్ అసలు రూపాన్ని మొత్తం ప్రపంచానికి చూపిస్తాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.
103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభం
ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో రూ.1,100 కోట్లతో రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల ఆధునీకరణ కోసం గత 11 ఏళ్లుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దేష్ణోక్ స్టేషన్‌లో బికనెర్–ముంబై ఎక్స్‌ప్రెస్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అలాగే రైల్వేలు, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు సంబంధించిన రూ.26,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు బికనెర్ జిల్లాలోని ప్రఖ్యాత కర్ణి మాత ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం ఎలుకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎటు చూసినా ఎలుకలే కనిపిస్తుంటాయి. భక్తులు వాటిని పవిత్రంగా భావిస్తారు.