
ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న పాక్ వైమానిక స్థావరం
కరాచీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసమైన నూర్ ఖాన్ ఖాన్ వైమానిక స్థావరాన్ని పాకిస్తాన్ తిరిగి నిర్మించుకునే పనిలో పడింది. ఇటీవల చైనాలోని తియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్రానికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రత్యేక జెట్ విమానం రావలి్పండిలోని ఈ స్థావరం నుంచే బయలు దేరిందని సమాచారం.
భారత్ క్షిపణి దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైన ప్రాంతానికి కొద్ది మీటర్ల దూరంలోనే మునీర్ ప్రయాణించిన విమానం రన్ వే మొదలవుతుంది. ఈ విషయాన్ని ఇంటెల్ ల్యాబ్‌లోని జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సిమోన్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వాడే గ్లోబల్ 6000 మిలటరీ రవాణా విమానం ఇక్కడే పార్కు చేసి ఉందని సిమోన్ తెలిపారు. ఆ ప్రాంతంలో గతంలో స్పెషలైజ్డ్ మిలటరీ ట్రక్కులు ఉండేవి.
గగనతల, భూతల వ్యవస్థలతో కమ్యూనికేషన్‌ను కొనసాగించేందుకు వీటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లుగా వినియోగించే వారు. అయితే, భారత్ దాడుల్లో ఈ ట్రక్కులు, పక్కనున్న నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న వాటిని పూర్తిగా తొలగించేసి నాలుగు నెలల అనంతరం ఇప్పుడు తాజాగా అదే ప్రాంతంలో నూర్ ఖాన్ బేస్‌కు సంబంధించిన పునాదులు, గోడల నిర్మాణ పనులు మొదలైనట్లు సిమోన్ వివరించారు.
గతంలో గోడల నిర్మాణం తీరు, ప్రస్తుత నిర్మాణ తీరును పోల్చితే ఈ విషయం అవగతమవుతోందన్నారు. వైమానిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన ఈ స్థావరాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని పాకిస్తాన్ యోచిస్తున్నట్లు తెలుస్తుందని వివరించారు. బుర్రాక్స్ అని పిలుచుకునే 12వ నంబర్ స్క్వాడ్రన్ ఈ బేస్ నుంచే కార్యకలాపాలు సాగిస్తూంటుంది.
ఈ విమానాలే పాక్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి, సైన్యాధిపతులు, మంత్రులు తదితర వీఐపీల రవాణాకు వాతుంటారు. ఇటీవల పాక్ ప్రధాని షహబాజ్ ఓ కార్యక్రమంలో మేలో జరిగిన ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఆ అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో జనరల్ మునీర్ నాకు ప్రత్యేకంగా ఫోన్ చేశారు. భారత్ మన దేశంపై క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి నూర్ ఖాన్ ఎయిర్‌పోర్టుపై పడిందని తెలిపారు’అని వివరించారు.