లేహ్: పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా గత మే నెలలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భారత సాయుధ దళాల క్రమశిక్షణ, సంయమనంతో కూడిన ప్రవర్తనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మెచ్చుకున్నారు. ఆదివారం లేహ్(లడఖ్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో దళాలకు.. దాడులను మరింత తీవ్రతరం చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ, వారు ఉద్రిక్తతలను పెంచకుండా, ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా తటస్థీకరిస్తూ, సంయమనాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ విధంగా వారు శౌర్యం, వ్యూహాత్మక వివేకం రెండింటినీ ప్రదర్శించారని సింగ్ స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌లో సాయుధ దళాలు, పౌర పరిపాలన, సరిహద్దు ప్రాంతాలలో.. ముఖ్యంగా లడఖ్‌లోని పౌరుల మధ్య అద్భుతమైన సమన్వయాన్ని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఇది భారతదేశ ఐక్యతను గుర్తు చేస్తుందన్నారు. ఇటువంటి సమయంలో స్థానిక సమాజాల మద్దతు కీలకమని, ఈ సమన్వయమే మనకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుందన్నారు. ప్రభుత్వం, సాయుధ దళాలు, పౌరుల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం ద్వారా సైన్యం ఈ బంధాన్ని కొనసాగించాలని ఆయన ఉద్ఘాటించారు.
ఆపరేషన్ సిందూర్ విజయానికి సరిహద్దు ప్రాంతాలలో మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కూడా ఒక కారణమని రక్షణ మంత్రి తెలిపారు. కనెక్టివిటీ రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రియల్-టైమ్ నిఘా, ఉపగ్రహ మద్దతు, జాతీయ భద్రతకు వెన్నెముకగా ఉండే లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు ఆపరేషన్ సింధూర్‌ను సక్సెస్ చేశాయన్నారు. లడఖ్‌తో సహా సరిహద్దు ప్రాంతాలలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం అనేది సైనిక కార్యకలాపాలకు మాత్రమే కాకుండా, పౌర జీవితానికి, ఆర్థిక వృద్ధికి కూడా మద్దతునిస్తుందని అన్నారు.
కాగా 2025-26 రెండవ త్రైమాసికంలో భారతదేశం 8.2 శాతం డీజీడీపీ వృద్ధిని సాధించడంలో మెరుగైన కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలు దోహదపడ్డాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మృతిచెందారు. వీరిలో పర్యాటకులు అధికంగా ఉన్నారు. ఈ దాడి దేశంలో తీవ్ర కలకలం రేపింది. దీనికి ప్రతిస్పందనగా, భారత సాయుధ దళాలు మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి.
ఇది కూడా చదవండి: కింగ్ చార్లెస్ సర్‌ప్రైజ్.. క్రిస్మస్ సందడి షురూ!


